భీమిని, జూలై 14 : భీమిని మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద సోమవారం రైతులు యూరియా కోసం ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి సరిపడా యూరియా పంపిణీ చేయాలని సీఈవో రాజేశ్వర్తో వాగ్వాదానికి దిగారు. దీంతో సిబ్బంది యూరియా పంపిణీని నిలిపివేశారు. రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు గొడవ సద్దుమణిగేలా చేశారు.
ఏడీఏ సురేఖ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. యూరియా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు సరైన ఆధారాలు దొరికితే దుకాణాదారులపై చర్యలు తీసుకుంటామన్నారు. మార్క్ఫెడ్ ద్వారా ఇంకా ఎక్కువ యూరియా అందేలా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు. ఆపై యథావిధిగా యూరియా పంపిణీ కొనసాగింది.
సీఈవో రాజేశ్వర్ రైతులతో మాట్లాడుతూ భీమిని, కన్నెపల్లి మండలాలకు కలిపి ఒకే సొసైటీ భీమినిలో ఉందని, కాబట్టి కన్నెపల్లి మండల రైతులకు కూడా భీమిని నుంచే పంపిణీ చేస్తామన్నారు. ఇప్పటి వరకు 780 బ్యాగులు పంపిణీ చేశామన్నారు. ఏడీఏ వెంట వ్యవసాయాధికారి యమునదుర్గ, ఏఈవోలు వినోద్, కార్తీక్, అఫ్రోజ్, తదితరులు ఉన్నారు.