బేల, సెప్టెంబర్ 14 : బేల మండల వ్యాప్తంగా పొలాల అమావాస్య పండుగను రైతులు ఘనంగా జరుపుకున్నారు. హనుమాన్ ఆలయాల ప్రదక్షిణలు చేయించారు. పొలాల పండుగతో పంటలు సమృద్ధిగా పండుతాయని రైతుల విశ్వసిస్తారు. మణియార్పూర్లో ఎంపీపీ వనితాఠాక్రే, చంద్పెల్లిలో జడ్పీటీసీ అక్షిత పవార్ కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు ఎడ్లకు పూజలు చేసి, నైవేద్యాలు సమర్పించారు. ఆయా కార్యక్రమాల్లో బేల సర్పంచ్ వట్టిపెల్లి ఇంద్రశేఖర్, నాయకులు గంభీర్ఠాక్రే, సతీశ్ పవార్, దేవన్న, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
భీంపూర్, సెప్టెంబర్ 14 : భీంపూర్ మండలం కరంజి(టీ), అంతర్గాం, పిప్పల్కోటి తదితర గ్రామాల్లో వేడుక ఘనంగా సాగింది. డప్పువాద్యాలతో పూజాదికాలు చేశారు. మహిళలు మంగళహారతులతో నందీశ్వర స్వరూప ఎడ్లను పూజించారు. రైతులు, కూలీలు సహపంక్తి భోజనాలు చేశారు.
తాంసి, సెప్టెంబర్ 14 : మండలంలో పొలాల అమావాస్య పండుగ ఘనంగా నిర్వహించారు. పలు గ్రామాల్లో శోభాయాత్ర నిర్వహించారు. బసవన్నలకు నైవేద్యాలు సమర్పించి, పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సురకుంటి మంజుల శ్రీధర్ రెడ్డి, జడ్పీటీసీ తాటిపల్లి రాజు, సర్పంచ్లు స్వప్నారత్న ప్రకాశ్, సదానందం, వెంకన్న, తూర్పుబాయి యశ్వంత్, అండె అశోక్, మునేశ్వర్ భరత్, అలాలి జ్యోతీనర్సింగ్, కుంట సరితా కేశవ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
గుడిహత్నూర్, సెప్టెంబర్ 14 : గుడిహత్నూర్ మండలంలో రైతులు ఎడ్లకు ప్రత్యేక పూజలు చేశారు. మండల కేంద్రంలోని శివాలయం వద్ద ఎడ్లను ఒకచోట చేర్చి, మధ్యలో ఆవు ఉంచి వివాహ మంత్రాలతో పెండ్లి జరిపారు. ఈ కార్యక్రమంలో చిన్నాపెద్దా తేడా లేకుండా హాజరై, వేడుకలను తిలకించారు.
నార్నూర్, సెప్టెంబర్ 14 : నార్నూర్, గాదిగూడ మండలాల్లో వేడుక ఘనంగా నిర్వహించారు. ఎడ్లను గ్రామ పటేల్ ఇంటి వద్దకు తీసుకెళ్లారు. గ్రామపెద్దలు ఎడ్లకు పూజలు చేసి, రైతన్నలకు కానుకలు అందజేశారు. నేడు బొడగ పండుగను నిర్వహించనున్నారు.
ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 14 : ఆదిలాబాద్ రూరల్ మండలంలోని వాన్వాట్, అంకోలి, తంతోలి, చాందా(టీ) తదితర గ్రామాల్లో రైతులు పొలాల పండుగ జరుపుకున్నారు. గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది.
ఇచ్చోడ(సిరికొండ), సెప్టెంబర్ 14 : ఇచ్చోడ, సిరికొండ మండలాల్లోని ఆయా గ్రామాల్లో పొలాల అమావాస్య ఘనంగా జరుపుకున్నారు. ఉదయం పూట ఎడ్లను అలంకరించారు. అనంతరం ఆలయాల్లో ప్రదక్షిణలు చేయించారు.
ఇంద్రవెల్లి, సెప్టెంబర్ 14 : మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయానికి కట్టిన మామిడి తొరణాలను ఇంద్రవెల్లి గ్రామపటేల్ మారుతీ పటేల్ డోంగ్రే కర్రతో తెంపిన తర్వాత ఎడ్లజతలతో ప్రదక్షిణలు చేయించారు. గిరిజన సాంప్రదాయం ప్రకారం పూజల చేశారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ఆలయానికి తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
బజార్హత్నూర్, సెప్టెంబర్ 14 : మండలంలోని దేగామ, పిప్పిరి, గిర్నూర్, బజార్హత్నూర్, జాతర్ల, భూతాయి తదితర గ్రామాల్లో వేడుకలు నిర్వహించారు. ఇడ్లల్లో మట్టితో చేసిన మం టెడ్లకు ప్రత్యేక పూజలు చేపట్టారు.రైతులకు పొలాల పండుగ పెద్ద పండుగ కావడంతో గ్రామాల్లో సందండి నెలకొంది.
బోథ్, సెప్టెంబర్ 14 : బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ బసవన్నలకు కుటుంబ సమేతంగా పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలందరికీ పొలాల అమావాస్య శుభాకాంక్షలు తెలిపారు. బోథ్, సొనాల, కౌఠ (బీ), ధన్నూర్ (బీ), పొచ్చెర, కుచ్లాపూర్, పట్నాపూర్, కన్గుట్ట, మర్లపెల్లి తదితర గ్రామాల్లో రైతులు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఉట్నూర్ రూరల్, సెప్టెంబర్ 14 : మండలంలోని లక్కారం, కొత్తగూడ, లింగోజి తండా, సాలేవాడ, హస్నాపూర్, వడోని, చాందూరి, నర్సాపూర్, లక్షటిపేట్ తదితర గ్రామాలోల పండుగ ఘనంగా నిర్వహించారు. ఎడ్లను దైవంగా భావించి ఈ పండుగ జరుపుకుటున్నట్లు రైతులు పేర్కొన్నారు.
తలమడుగు సెప్టెంబర్ 13 : మండల కేంద్రంతో పాటు సుంకిడి, లింగి, కుచులాపూర్, బరంపూర్, దేవాపూర్, కజ్జర్ల తదితర గ్రామాల్లో పండుగ ఘనంగా నిర్వహించారు. బసవన్నలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారం పొలాల అమావాస్యను రైతులు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఉదయాన్నే ఎడ్లను వాగులు, చెరువుల వద్దకు తీసుకెళ్లి, స్నానాలు చేయించారు. కొమ్ములకు రంగులు దిద్ది, కాళ్లకు గజ్జెలు కట్టి, కుశాటలు, జూళ్లు ఇతర సామగ్రితో వాటిని అందంగా అలంకరించారు. అనంతరం ఆలయాలకు తీసుకెళ్లి, ప్రదక్షిణలు చేయించారు. ఇంటి వద్ద ఎడ్లకు ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యంసమర్పించారు. ఉదయం నుంచే ఆలయాల వద్ద సందడి చేశారు. పలు గ్రామాల్లో శోభాయాత్ర నిర్వహించారు.