కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ) : కేసీఆర్ సర్కారు హయాంలో యాసంగి, వానకాలాలకు సంబంధించిన రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో ఠంచన్‌గా జమయ్యేవి.యేడాదికి రెండు సార్లు(సీజన్‌కు రూ.5 వేల చొప్పున) రెండు సీజన్లకు రూ.10 వేలు వచ్చేవి. సాగుకు ముందే డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ అవడంతో రైతులు కూడా పెట్టుబడికి ఢోకా లేకుండా సాగు చేసుకునే వారు. విత్తనాలు, ఎరువులు, రసాయనిక ఎరువులను కొనుగోలు చేసి నిశ్చింతగా ఉండేవారు. యాసంగి సీజన్లో ఈ సమయానికి భూములన్నీ పంటలతో కళకళలాడేవి.
కాగా.. కేసీఆర్ సర్కారు ఈ యాసంగిలో రైతుబంధు డబ్బులు వేయడానికి సిద్ధమైంది. ఇంతలోనే అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడం, కాంగ్రెస్ పార్టీ అమలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పటివరకు మూడెకరాలు ఉన్న రైతులకు మాత్రమే డబ్బులను జమ చేసింది. అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటుతున్నా..అందరి ఖాతాల్లో డబ్బులను జమ చేయలేదు. దీంతో కొందరు రైతులు పెట్టుబడి కోసం దళారుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. మరికొందరు పెట్టుబడి లేక పంటలు వేయలేదు. ఫలితంగా బీడు భూములు దర్శనమిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే సాయన్ని పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు.
పెంచికల్ పేట్, ఫిబ్రవరి 11 : నాకు ఎల్లూరు శివారులో ఐదెకరాలు ఉంది. వానకాలంలో వరి పండించిన. సరైన కొనుగోలు సెంటర్ లేక కిందా.. మీదా పడి మధ్యవర్తులకు పంట అమ్ముకున్న. గిట్టుబాటు ధర కంటే రూ. 100 తక్కువకే అమ్మాల్సి వచ్చింది. యాసంగి పంట వేద్దామంటే కరెంటు కోతలు మొదలైనయి. కాంగ్రెసోళ్లు అధికారంలోకి రావడం రైతులకు శాపంగా మారింది. గద్దె మీద ఎకగానే పెంచిన రైతుబంధుతో పాటు రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తామని నమ్మించి గొంతుకోసిన్రు. కనీసం ఇప్పటివరకు రైతుబంధుకు దికులేదు. పెట్టుబడి అందక.. కరెంటు మీద నమ్మకం లేక యాసంగి రెండో పంట వేయలే. కాంగ్రెస్ సర్కారు పుణ్యామాని రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలే. -ఖలీల్ బేగ్, రైతు, పెంచికల్పేట్
పెంచికల్ పేట్, ఫిబ్రవరి 11 : కేసీఆర్ సర్కారులో పంటలకు ముందే రైతుబంధు డబ్బులేసేటోళ్లు. రంది లేకుంట ఎవుసం చేసుకునేటోళ్లం. కాంగ్రెస్ సర్కారు రాంగనే రైతులను గోస పెడుతుంది. నాకు బొకి వాగు ప్రాజెక్టు కింద ఐదెకరాల పొలముంది. ఎట్లనో అట్ల తిప్పల పడి పంట వేసిన. మందులు, కూలీలు, విత్తనాలకు అప్పు తెచ్చి పెట్టిన. కొత్త ప్రభుత్వం వచ్చి గిన్ని రోజులైనా రైతుబంధు వేయకపాయే. ఆనాడు కరెంట్ కోసం.. ఎరువుల కోసం చెప్పులు పెట్టి ధర్నాలు చేసినం. మళ్లా గసొంటి పరిస్థితే వస్తంది.
– చిన్నబోయిన చినన్న, రైతు, పెంచికల్పేట్
కౌటాల, ఫిబ్రవరి 11 : నా పేరు కొడిపే బుచ్చన్న. నాది కౌటాల గ్రామం. మా ఊరి శివారులో 6 ఎకరాలు ఉంది. తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక రైతుల బాధలన్నీ పోయినయి. పంట పెట్టుబడి కోసం శావుకార్ల చుట్టూ తిరగకుండా రైతుబంధు తీసుకొచ్చిండు. ఎకరానికి రూ. 5 వేల చొప్పున రెండు పంటలకు రూ. 10 వేలు ఇచ్చేటోళ్లు. పంట వేసే ముందే రైతుబంధు పైసలేసోటోళ్లు. గవ్విటితోనే విత్తనాలు, ఎరువులు కొనుక్కునేటోళ్లం. రంది లేకుంట ఎవుసం చేసేటోళ్లం. గిప్పుడు కాంగ్రెస్ సర్కారు వచ్చింది. గిప్పటిదాకా రైతుబంధు డబ్బులు పడలే. మళ్లా మునుపటి లెక్కనే అయ్యింది. పంటల సాగు కోసం శావుకార్ల దగ్గర మళ్లా అప్పులు చేయాల్సి వచ్చింది. కొందరైతే రైతుబంధు రాదంటున్నరు. పెట్టుబడి ఖర్చులు పెరిగిపాయే.. గిట్లయితే ఎవుసం ఎట్లా చేసుడో.. ఏమో..
– కొడిపే బుచ్చన్న, రైతు, కౌటాల
కౌటాల, ఫిబ్రవరి 11 : నా పేరు డుబ్బుల దేవాజీ. నాకు కౌటాలలో 5 ఎకరాల భూమి ఉంది. కేసీఆర్ సర్కారులో రంది లేకుంట ఎవుసం చేసుకున్నం. పంట వేసే ముందే రైతుబంధు ఇచ్చేటోళ్లు. గా పైసలతో మంచిగ విత్తనాలు, ఎరువులు కొనుక్కునేటోళ్లం. అధికారంలోకి వచ్చిన కాంగ్రెసోళ్లు గా మాటే ఎత్తుతలేరు. అప్పు తెచ్చి యాసంగి పంట వేసిన. రైతుబంధు కోసం నాలాంటి రైతులు ఎంతో మంది ఎదురుచూస్తున్నరు. ఇప్పటి వరకు 3 ఎకరాలు దాటిన ఏ ఒక్క రైతుకు కూడా పైసలు వేయలే. కేసీఆర్ సర్కారు రైతుల బాధలను తీర్చింది. గీ సర్కారోళ్లు రైతులను గోస పెడుతున్నరు. గిదేనా పాలన..