ఆదిలాబాద్, జూన్ 8(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా పంటలు కొనుగోలు చేస్తున్నా.. వాటిని నిల్వ చేసుకొనేందుకు గోదాములు లేకపోవడంతో మార్కెట్ యార్డుల్లోనే పేరుకుపోతున్నాయి. జొన్న కొనుగోళ్లు ముగియగా.. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో 50 వేల క్వింటాళ్లకు పైగా జొన్న సంచులు నిల్వ ఉన్నాయి. ప్రభుత్వం కొనుగోలు చేసిన సోయా, కంది, శనగ, మక్క, జొన్న పంటలను సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ, ఇతర గోదాముల్లో భద్రపరుస్తుంది. వానకాలం, యాసంగిలో కొనుగోలు చేసిన పంటలతో గోదాములు నిండిపోయాయి.
1.12 లక్షల ఎకరాల్లో జొన్న సాగవగా.. 6 లక్షల క్వింటాళ్ల పంటను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేసింది. ఈ పంటను నిల్వ చేసుకొనేందుకు ప్రభుత్వ గోదాములు సరిపోక.. ప్రైవేటు గోదాములను కిరాయికి తీసుకున్నారు. ప్రైవేటు గోదాములు కూడా నిండిపోగా మార్కెట్ యార్డుల్లో పంట నిల్వలు ఉన్నాయి. దీంతో అధికారులు ప్రభుత్వ, ప్రైవేటు గోదాముల కోసం వెతుకుతున్నారు. వానకాలం ప్రారంభమవగా.. జిల్లాలో వర్ష సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించించిన నేపథ్యంలో పంట తడిసిపోయి నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

రూ.22.50 కోట్లతో తొమ్మిది గోదాములను నిర్మించిన బీఆర్ఎస్ ప్రభుత్వం
రైతులు పండించిన పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం నిల్వ చేసుకొనేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందు లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రూ.22.50 కోట్లతో తొమ్మిది గోదాములను నిర్మించింది. 45 వేల మెట్రిక్ టన్నుల పంటలను నిల్వ చేసుకొనే సామర్థ్యం ఉన్న ఈ గోదాములు రైతులకు ఉపయోగపడుతున్నాయి. ఇచ్చోడ మా ర్కెట్ యార్డులో రూ.1.50 కోట్లతో 2500 మె ట్రిక్ టన్నుల నిల్వగల గోదాం, నార్నూర్‌లో రూ. 3 కోట్లతో 5 వేల మెట్రిక్ టన్నులు, బేలలో రూ.3 కోట్లతో 5 వేల మెట్రిక్ టన్నులు, బోథ్‌లో రూ.3 కోట్లతో 5 వేల మెట్రిక్ టన్నులు, తలమడుగులో రూ.3 కోట్లతో 5 వేల మెట్రి క్ టన్నులు, తాంసి మండలంలోని బండల నాగాపూర్‌లో రూ.3 కోట్లతో 5వేల మెట్రిక్ టన్నులు, ఇంద్రవెల్లి మండలం ధనోరలో రూ.3 కోట్లతో 5వేల మెట్రిక్ టన్నులు, గుడిహత్నూర్ మండలం కొల్హారిలో రూ.3 కోట్లతో 5వేల మెట్రిక్ టన్నులు, ఉట్నూర్‌లో రూ.3 కోట్లతో 5వేల మెట్రిక్ టన్నులు సామర్థ్యం గల గోదాముల నిర్మాణాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగాయి. ప్రస్తుతం ఈ గోదాములు రైతులకు ఉపయోగపడుతున్నాయి.