దిలావర్పూర్, అక్టోబర్ 19 : ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఉత్పత్తులను ఆరబెట్టుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. రహదారులపై ఆరబెడుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని నివారించడానికి కేసీఆర్ సర్కారు 2021-2022 ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కల్లాల నిర్మాణాలు చేపట్టింది. రైతులు తమ చేలలో నిర్మించుకోవడానికి అవకాశం కల్పించింది. నిర్మల్ జిల్లావ్యాప్తంగా 1960 మంజూరు కాగా 1019 మంది కల్లాలను ఏర్పాటు చేసుకున్నారు. ఒక కల్లానికి అప్పటి ప్రభుత్వం రూ. ఒక లక్ష మంజూరు చేసింది. ఎస్సీ, ఎస్టీలకు రూ.70 వేల నుంచి రూ.90 వేల వరకు చెల్లించింది. అంతలోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం కల్లాల నిర్మాణాలు ఆపేయాలని సూచించింది. దీంతో రైతులు కూడా నిర్మాణాలు ఆపారు.
రైతులు పంట ఉత్పత్తులను అరబెట్టుకునేందుకు కల్లాలు లేక రోడ్లపైనే ధాన్యం కుప్పలు పోసి ఉంచుతున్నారు. రా త్రివేళ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు రైతులు ప్ర త్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరముందని వాహనదారులు పేర్కొంటున్నారు. గతేడాది నిర్మల్-భైంసా 61వ జాతీయ రహదారిపై మక్కలు, వడ్లు అరబెట్టడంతో రాత్రి పూ ప్రమాదాలు జరిగాయి. కాగా.. కల్లాలను నిర్మించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నట్లు అధికారులు చెప్పుతున్నారు. కానీ.. నిర్మాణాలు చేపట్టడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయలేదు. దీంతో రైతులు తీవ్ర నిరాశతో ఉన్నారు.
మేము పంటలు ఆరబెట్టుకునేం దుకు తీవ్ర అవస్థలు పడుతున్నం. మా ఊరి శివారులో రోడ్లు, ఖాళీ ప్రదేశాల్లో ఆరబెడు తున్నాం. కేసీఆర్ సర్కారు కల్లాలు మంజూరు చేసింది. కట్టుకున్న వారికి డబ్బులు కూడా ఇచ్చింది. మేం కట్టుకుంటామనే సరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వద్దని చెప్పాయని అధికారులు తెలిపారు. ఇప్పటికైనా కొత్తవి మంజూరు చేయాలని కోరుతున్నా.
-నంద ముత్యం, రైతు, దిలావర్పూర్.