ఫలితం పార్టీది, ఫలం రేవంత్‌రెడ్డిది అన్నట్టుగా ఉన్నది తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి. పార్టీలో సీనియర్ అయిన పీసీసీ అధ్యక్షుడి కన్నా ముఖ్యమంత్రి పెత్తనమే పార్టీపై సాగుతున్నది. సమష్టిగా కాకుండా తన ఆలోచనలనే ఆచరణలో పెట్టేలా రేవంత్ అందరికీ సూచనలు చేస్తున్నారు. సాధారణంగా స్థానిక ఎన్నికల ఫలితాలు పాలకపక్షం వైపే మొగ్గు చూపుతాయి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు విజయం లభిస్తే.. అది తన ఘనతే అన్నట్టుగా రేవంత్ మాటలు ఉంటున్నాయి. పార్టీ సీనియర్లకు ఈ విధానం మింగుడు పడకున్నా వారు ఊరుకోక తప్పడం లేదు. కొందరు మాత్రం బహిరంగ విమర్శలు చేస్తూ రేవంత్ వైఖరిని తప్పుబడుతున్నారు.
తాను లేకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే లేదు అనే భావన రేవంత్‌రెడ్డిలో నిలువెల్లా ఆవహించింది. నిజానికి ఆ పార్టీ అధిష్ఠానం ఆయనను ముఖ్యమంత్రిని చేసింది తప్ప.. పార్టీని ఆయన గద్దెనెక్కించలేదు. కాంగ్రెస్‌ను గెలిపించడంలో రేవంత్‌రెడ్డి పడ్డ శ్రమ ఏమీ లేదు. పార్టీ సీనియర్లలో లేని దూకుడుతనం ఆపత్కాలంగా కాంగ్రెస్ అధిష్ఠానానికి అవసరమైంది. ఆయన పైపై విధేయత, ఏకపక్ష నిర్ణయాలు, కట్టుబాటును దాటే మాటలు, మొక్కుబడిగా కలవటాలు.. అన్నీ ఢిల్లీ పెద్దలకు ఇరకాటకంగానే ఉన్నది.
ఈ మధ్య జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిచ్చాపాటి మాటలతో కూడిన ఒక వీడియో ప్రచారంలోకి వచ్చింది. పార్లమెంట్ భవనం ముందు యూపీకి చెందిన మరో కాంగ్రెస్ నేతతో ఆయన ఇలా అన్నట్లుగా అందులో ఉన్నది. ‘ఆ హైదరాబాదీని రానివ్వకు. ఒక్కసారి వచ్చాడంటే తనతో పాటు మనలను కూడా నాశనం చేస్తాడు. హైదరాబాదీ అంటే ఏమిటో నీకు తెలుసా? అది మూడు విషయాల్లో ప్రత్యేకమైనది. ఒకటి షేర్వాణీ, మరోటి బిర్యానీ, మూడోది పరేషానీ’. ఆయన యథాలాపంగా అన్న ఈ మాటలు నర్మగర్భంగా ఉన్నాయి. పేరెత్తుకోకుండా కాంగ్రెస్‌ను ఇబ్బంది పెడుతున్న ఆ హైదరాబాద్ వ్యక్తిని ఉద్దేశించి అన్న మాటల్లో ఎన్నో పార్శ్యాలు దాగి ఉన్నాయి.
మరోసారి ఢిల్లీ వెళ్లిన రేవంత్‌రెడ్డి పాత్రికేయుల సమావేశంలో.. వచ్చిన పనిని వివరించకుండా మనసులో గడబిడ చేస్తున్న మాటల్ని కక్కేశారు. ‘నేనే రాజు.. నేనే మంత్రి.. నాకు ఎవరూ పోటీ లేరు.. నాకు నేనే పోటీ.. నేను మొనగాణ్ని..’ అనే ఆయన మాటలు పత్రికల్లో పతాక శీర్షికలు అయ్యాయి. ఒక సీఎం స్థాయి మాటల్లా కాకుండా అవి ఓ సినిమా డైలాగులా ఉన్నాయి. 4 రోజుల తర్వాత రేవంత్‌రెడ్డి తన మాటలకు తానే కొత్త వివరణ ఇచ్చుకున్నారు. తన ‘రాజు, మంత్రి’ మాటలను వక్రీకరించారు. మేము పాలకులం కాదు.. సేవకులమని ఏనాడో చెప్పాను. నేను పాలకుడిగా ఎప్పుడూ ప్రవర్తించలేదు’ అని కొత్త పలుకులు పలికారు. ఆయన మాటలు ‘నేనే’ నుంచి ‘మేము’గా మారిపోయాయి. ఈ రెండు స్టేట్మెంట్ల మధ్య రోజుల వ్యవధిలో అంతర్గతంగా విమర్శలు రావచ్చు. సమష్టి కృషి అనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడక తప్పలేదు.
రేవంత్‌రెడ్డి ‘రాజు, మంత్రి’ మాటలపై ఆ పార్టీలోని కొందరు గుంభనంగా ఉన్నా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాత్రం నోరు విప్పారు. ‘కాంగ్రెస్ చరిత్రలో పార్టీని ఇలా ధిక్కరించి మాట్లాడినవారు లేరు. అధిష్ఠానం నిర్ణయం కన్నా ముందే ముఖ్యమంత్రిని లేదా ప్రధానమంత్రిని నేనే అని గతంలో ఎవరూ చెప్పలేదు’ అన్నారాయన. చాలాకాలంగా రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్‌రెడ్డి విరుచుకుపడుతున్నారు. రేవంత్‌ను అవుట్ సైడర్గానే పరిగణిస్తున్నట్టు ఆయన మాటలు ఉంటున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అధిష్ఠానం ఎవరిని నిర్ణయిస్తే వారినే ముఖ్యమంత్రిగా ప్రకటించడం ఆనవాయితీ.
కాంగ్రెస్ సంస్కృతికి భిన్నంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు. వచ్చే ఎన్నికల తర్వాత కూడా తానే ముఖ్యమంత్రి అవుతానని ప్రకటించుకున్నారు. ఇప్పుడు ఎన్ని సవరణలు ఇచ్చుకునేందుకు ప్రయత్నించినప్పటికీ రేవంత్‌రెడ్డి మనసులోని మాటలనే బయట పెటుకున్నారనేది గ్రహించవచ్చు. రేవంత్ ఉద్దేశం కూడా ఇదే కావచ్చు. కానీ కాంగ్రెస్ రాజకీయాలను నిశితంగా గమనించే వారికి మాత్రం రేవంత్‌రెడ్డి తాజా వ్యాఖ్యలు ఆశ్చర్యపరచక మానవు. ‘ఆయన తెలంగాణకు మాత్రమే నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా లేదు. పార్టీలో కూడా ఆయనే రాజు.. ఆయనే మంత్రి అన్నట్టుగా మాటలు ఉన్నాయి’ అని ఒక పత్రిక రాసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయని భావించడానికి ఇది సమయం కాదు. మున్సిపల్ ఫలితాలను దృష్టిలో పెట్టుకొని తాను ‘రాజు.. మంత్రి’ మాటలు అన్నానని రేవంత్ సవరణలో ఉన్నది. అయితే 2020లో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన ఫలితాల కన్నా ఇప్పుడు కాంగ్రెస్ ఒక మెట్టు కిందికే ఉన్నది. అప్పుడు బీఆర్ఎస్ 120 మున్సిపాలిటీల్లో 109, 10 కార్పొరేషన్లలో ఎనిమిదింట సంపూర్ణ ఆధిక్యతతో గెలిచింది. 77 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హంగ్ సమస్య రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ 66 మున్సిపాలిటీల్లో, 3 కార్పొరేషన్లలో మాత్రమే ఆధిక్యతతో విజయాన్ని సాధించింది. మరి రేవంత్‌రెడ్డి ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అనే స్థాయి ఉత్సాహానికి వేరే కారణం ఉండొచ్చు.
ఇప్పుడు ఎన్ని సవరణలు ఇచ్చుకునేందుకు ప్రయత్నించినప్పటికీ రేవంత్‌రెడ్డి తన మనసులోని మాటలనే బయట పెట్టుకున్నారని గ్రహించవచ్చు. ఆయన కోరుకునేది కూడా ఇదే కావచ్చు. కానీ కాంగ్రెస్ రాజకీయాలను నిశితంగా గమనించే వారికి మాత్రం రేవంత్‌రెడ్డి తాజా వ్యాఖ్యలు ఆశ్చర్యపరచక మానవు.
-బద్రి నర్సన్