ఆదిలాబాద్, జూన్ 17(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కారు రైతులను గోస పుచ్చుకుంటున్నది. విత్తనాలు, ఎరువులను సకాలంలో పంపిణీ చేయక.. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వక అరిగోస పెడుతున్నది. కనీసం పండించిన పంటను మార్కెట్కు తీసుకొచ్చిన కొనుగోలు చేయడంలో నెలల తరబడి తిప్పుకుంటున్నది. దీంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ యాసంగిలో రైతులు 1.12 లక్షల ఎకరాల్లో జొ న్నలు సాగు చేయగా.. 16 లక్షల క్వింటా ళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచ నా వేశారు. ఇందుకు అనుగుణంగా మా ర్క్ఫెడ్ ఆధ్వర్యంలో కేంద్రాలను ప్రారంభించారు.
లారీలు, హమాలీల కొరత, పంటను గోదాముల్లోకి తరలించడంలో జాప్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మేలో ఆదిలాబాద్ జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. మండుటెండలో పంట అమ్మకానికి మార్కెట్ యార్డుల్లో పడిగాపులు కాశారు. రాత్రనక, పగలనక జాగారం చేశారు. చాలా కేంద్రాల్లో పంటను కాంటా చేసినా.. లారీల్లో లోడింగ్ అయ్యేంత వరకు ఉండాలని చెప్పారు. అప్పటివరకు పట్టీలు ఇవ్వమని కేంద్రాల నిర్వాహకులు సూచించడంతో అన్నదాతలు రోజుల తరబడి మార్కెట్ యార్డుల్లో పడిగాపులు కాశారు.
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పొన్న గ్రామానికి చెందిన రైతు నావార్గే పాండురంగ్ సిరికొండ కొనుగోలు కేంద్రానికి 35 క్వింటాళ్ల జొన్న పంటను మే 28న తీసుకొచ్చాడు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఆయన పంటను ఈ నెల 8న సంచుల్లో నింపి కాంటా చేశారు. కాంటా చేసినా లారీల్లో లోడింగ్ చేసేంత వరకు రైతులకు తక్పట్టీ ఇవ్వడం లేదు. సంచుల రవాణా చేసే లారీలు రాకపోవడంతో రైతులు కాపలా ఉండాల్సి వస్తున్నది. కాంటా అయిన పంట లోడింగ్ కాకపోవడంతో మనస్తాపానికి గురైన రైతు పాండురంగ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పంట కుప్ప వద్దే పాణాలు విడిసిండని తెలిపారు. కొన్ని మార్కెట్ యార్డుల్లో రైతుల పంట కాంటా చేసిన తర్వాత రైతుకు పట్టీలు ఇస్తున్నారు.
సిరికొండలో లోడింగ్ అయ్యేంత వరకు ఇవ్వడం లేదని తెలుస్తున్నది. మరణించిన రైతుకు పాండురంగ్కు భార్యతో పాటు 15, 12, 9 సంవత్సరాల ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రైతు పాండురంగ్ ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పాడు రంగ్ విషయమై మార్కెఫెడ్ మేనేజర్ మహేశ్ కుమార్ను అడుగగా.. పాండురంగ్ తీసుకువచ్చిన పంటకు లాట్ నంబర్ ఇచ్చి ఈ నెల 8న కాంటా చేసి సంచుల్లో నింపారు. పంటను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు భద్రపర్చారు. లారీల్లో జొన్న సంచులను లోడింగ్ చేయాలని సిబ్బంది రైతు పాండురంగ్కు ఫోన్ చేసినా స్పందించలేదు.