ఆదిలాబాద్, మార్చి 24(నమస్తే తెలంగాణ) : ‘కాంగ్రెస్ సర్కారు ఎకరాకు ఇస్తున్న రైతు భరోసా డబ్బులు యాడికి సరిపోతాయి. మాకున్న మొత్తం భూమికి డబ్బులు వస్తాయని ఆశిస్తే.. ఎకరం భూమికి వేసి ఊరుకున్నారు. ఇప్పటికే యాసంగి సీజన్ చివరి దశకు చేరుకున్నది. శనగ పంట చేతికి రాగా.. మరో పది రోజుల్లో జొన్న, కంది తీయడం ముగుస్తుంది. సోమవారం ఎకరాకు రూ.6 వేలు వేసి ఏం లాభం.’ అని రైతులు కాంగ్రెస్ సర్కారు తీరును ప్రశ్నిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వానకాలంలో సాగు చేసిన పత్తి, సోయా పంటలను అధిక వర్షాల కారణంగా నష్టపోవాల్సి వచ్చిందని, కొనుగోళ్లలో నిబంధనల కారణంగా మద్దతు ధరతో సరిగా అమ్ముకోక నష్టపోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాసంగి ప్రారంభంలోనే రైతు భరోసా విడుదల చేస్తుందని ఆశించామని, సీజన్ ముగిసే సమయంలో కేవలం ఎకరం భూమికి మాత్రమే సాయం అందించారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేసిందని, ప్రతి సీజన్‌కు ముందుగానే పూర్తి పెట్టుబడి సాయం అందించిందని గుర్తు చేసుకుంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో 1.63 మంది రైతులు ఉండగా 5.50 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. 0 నుంచి 1 ఎకరం భూమి ఉన్న రైతులు 11,397, 1 ఎకరం నుంచి 2 ఎకరాల వరకు ఉన్నవారు 30,199 మంది, 2 నుంచి 3 ఎకరాలు ఉన్న వారు 35,514, 3 నుంచి 4 ఎకరాల ఉన్న వారు 28,279, 4 నుంచి 5 ఎకరాలు ఉన్న వారు 22,261, 5 నుంచి 6 ఎకరాలు ఉన్న రైతులు 15,759, 6 నుంచి 7ఎకరాలు ఉన్న రైతులు 6372, 7 నుంచి 8 ఎకరాలు ఉన్న వారు 4020, 8 నుంచి 9 ఎకరాలు ఉన్న రైతులు 2656, 9 నుంచి 10 ఎకరాలు ఉన్న వారు 1803, 10 ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతులు 4108 మంది ఉన్నారు. యాసంగి పంటకు సంబంధించి మొదటి విడుతలో సోమవారం 1,59,655 మంది రైతులకు ఎకరం పంటకు ప్రభుత్వం రూ.92.76 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు సమాచారం. యాసంగి పంట పెట్టుబడి సాయం 45 రోజుల్లో పూర్తిస్థాయిలో అందిస్తామని ప్రభుత్వం ప్రకటించగా రైతుల్లో ఆందోళన నెలకొన్నది. 20 రోజుల తర్వాత రెండో విడుత, 20 రోజుల తర్వాత మొత్తం డబ్బులు జమ చేస్తామని చెప్పినా, ఎన్ని ఎకరాలకు ఎప్పుడెప్పుడు ఇస్తారనే విషయాలను స్పష్టం చేయలేదని అన్నదాతలు అంటున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ రైతుబంధు పథకం కింద ప్రతి సీజన్లో రైతులకు ఎన్ని ఎకరాలు ఉన్నా మొత్తం డబ్బులు జమ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రెండు పంటల సాయం ఎగ్గొట్టింది. ఈ ఏడాది యాసంగి సీజన్ అయిపోయిన తర్వాత ఒక ఎకరం వరకు మాత్రమే ఇస్తున్నది. నాకు మూడెకరాల భూమి ఉంది. రైతు భరోసా రాకపోతే అప్పులు చేసి సాగు చేశా. ప్రభుత్వం ఇచ్చిన రూ.6 వేలు దేనికి సరిపోవు. రైతులకు మొత్తం సాయం అందించి ఉంటే అప్పులు చేసే అవకాశం ఉండదు. ఆ పైసలు ఇతర అవసరాలకు ఖర్చు అయిపోతాయి. ప్రభుత్వం రైతు భరోస కింద మొత్తం డబ్బులు రైతులకు అందించాలి.
– కలమడుగుల సంతోష్, రైతు, కొరాట, భోరజ్ మండలం