నిర్మల్, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ) : వరి ధాన్యం కొనుగోళ్లలో గందరగోళం నెలకున్నది. వ్యవసాయ శాఖ అధికారులు యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించినప్పటికీ, కేంద్రాల కేటాయింపుల్లో స్పష్టత లేదు. కేంద్రాల ఏర్పాటుపై నిర్వాహకుల్లో అయోమయం నెలకున్నది. ప్రతి సీజన్లో పీఏసీఎస్, ఐకేపీ, డీసీఎంఎస్, జీసీసీ ద్వారా కొనుగోళ్లు చేపడుతారు. ఆయా ఏజెన్సీలకు వాటి నిర్వహణ సామర్థ్యాన్ని బట్టి సెంటర్లను కేటాయిస్తారు. పీఏసీఎస్‌ల ద్వారా సొసైటీల్లో పని చేస్తున్న సిబ్బందితోపాటు తాత్కాలిక సిబ్బందిని నియమించుకుని ఒక్కో మండలంలో 10 నుంచి 15 సెంటర్లను నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే కొన్ని సీజన్లుగా డీసీఎంఎస్ ద్వారా ఏర్పా టు చేసే కొనుగోలు కేంద్రాలపై వివాదాలు తలెత్తుతున్నాయి. నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధుల అండదండలతో ఆయా సెంటర్ల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం వివాదాస్పదం అవుతున్నది.
డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే సెంటర్లను కొందరు రాజకీయ నాయకులు తమ అనుచరులకు ఇప్పించేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సెంటర్ల కేటాయింపులో డీసీఎంస్‌లో పని చేసే ఓ కీలకమైన వ్యక్తి హస్తం కూడా ఉన్నదని ప్రచారం జరుగుతున్నది. సదరు వ్యక్తి నేరుగా రాజకీయ నాయకులతో టచ్‌లో ఉంటూ.. వారి అనుచరులైన ప్రైవేటు వ్యక్తులకు సెంటర్లను కేటాయించేందు కు రాయబేరాలు నడిపిస్తాడని చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రైవేటు వ్యక్తులు సెంటర్ల నిర్వహణ ద్వారా వచ్చే కమీషన్‌ను 50 శాతం డీసీఎంఎస్‌కు చెల్లించాల్సి ఉంటుంది. అంటే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినందుకు గాను ప్రభుత్వం క్వింటాలుకు రూ.32ల కమీషన్ డబ్బులను నిర్వాహకులకు చెల్లిస్తుంది. ఇందులో రూ.16 నిర్వాహకులకు, మిగిలిన రూ.16లను డీసీఎంఎస్‌కు అందజేస్తారు.
ఇలా వందలాది మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వానికి అప్పగిస్తారు. అయితే ఈ కొనుగోలు ప్రక్రియ కాస్త వ్యాపారమయంగా మారడంతో చాలా మంది ప్రైవేటు వ్యక్తులు తమకున్న రాజకీయ పలుకుబడితో కేంద్రాలను దక్కించుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. వాస్తవానికి డీసీఎంఎస్‌ల ద్వారా కేవలం ఎరువులు విక్రయించడానికి మాత్రమే లైసెన్సులను జారీ చేస్తారు. వీరికి కొనుగోలు కేంద్రాలను కేటాయించాలన్న నిబంధన ఏదీ లేదు. ఇలా లైసెన్సు పొందిన వారిలో చాలామంది ఎరువుల దుకాణాలను సక్రమంగా నిర్వహించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఈ లైసెన్సును అర్హతగా చూపుతూ తమకు సెంటర్‌ను కేటాయించాలని చాలా మంది డీసీఎంఎస్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరికి తెరవెనుక కొందరు ప్రజాప్రతినిధుల మద్దతు ఉండడంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
సొసైటీలకే కేటాయించాలని డిమాండ్
మరోవైపు పీఏసీఎస్‌ల నిర్వాహకులు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్న తమకే కేంద్రాల ఏర్పాటులో మొదటి ప్రాధాన్యతనివ్వాలని పట్టుబడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 19 సొసైటీల ఆధ్వర్యంలో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను అందించడమే కాకుండా రుణాలను అందిస్తున్నారు. సొసైటీల ద్వారా ఏడాది పొడవునా రైతులకు సేవలను అందిస్తు న్న తమను కాదని డీసీఎంఎస్‌కు కొనుగోలు కేంద్రాల బాధ్యతలను అప్పజెప్పడంతో సొసైటీలు నష్టాల ఊబి లో కూరుకుపోతున్నాయని వారు వాపోతున్నారు. కుభీర్, తానూర్ మండలాల్లో వరి సాగు చేయరు. ఆ రెండు మండలాలు పోగా మిగతా 17 మండలాల్లో కొనుగోలు కేంద్రాల కేటాయింపునకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని సొసైటీ చైర్మన్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గత జనవరిలో జరిగిన డీసీఎంఎస్ ప్రత్యేక సమావేశంలో డైరెక్టర్లుగా ఉన్న ఆయా మండలాల పీఏసీఎస్ చైర్మన్లు మాట్లాడుతూ.. డీసీఎంఎస్‌లకు సెంటర్లు కేటాయించడం ద్వారా పీఏసీఎస్‌లు నష్టపోతున్నాయని పేర్కొన్నారు.
పీఏసీఎస్ కేంద్రాలు ఖరారు అయిన తర్వాతనే మిగిలినవి డీసీఎంఎస్‌లకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో వారి డిమాండ్‌ను జీర్ణించుకోలేని కొందరు కీలక ప్రజాప్రతినిధులు వీరిద్దరినీ (డీసీఎంఎస్, పీఏసీఎస్) కాదని వరి కొనుగోళ్ల బాధ్యతలను ఐకేపీ మహిళా సంఘాలకు కేటాయించాలన్న కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు. కొందరు రాజకీయ నాయకులు రైతుల మేలును పక్కన బెట్టి, కొనుగోలు సెంటర్లను వ్యాపార దృష్టితో చూడడంతోనే ఈ పరిస్థితి ఉత్పన్నమవుతున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అధికారులు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ అయోమయం కారణంగానే ఇప్పటి వరకు జిల్లాలో సెంటర్ల కేటాయింపు జరగలేదు. మరో వారం, పది రోజుల్లో వరి కోతలు ప్రారంభం కానుండడంతో ఈసారి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగుతుందా? లేదా? అన్న అనుమానాలు సర్వత్ర వ్యక్తమవుతున్నాయి.
త్వరలోనే కేటాయిస్తాం..
ఈ యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లా వ్యాప్తంగా 308 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. త్వరలోనే కేంద్రాల కేటాయింపులు జరుపుతాం. ఈసారి ఐకేపీ మహిళా సంఘాల ద్వారా ఎక్కువగా కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటాం. డీసీఎంఎస్ కేంద్రాల కేటాయింపుల్లో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తాం. గతంలో ఏవిధంగా కొనుగోళ్లు జరిగాయో, ఈసారి కూడా అదేవిధంగా అన్ని ఏజెన్సీల ద్వారా పకడ్బందీగా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తాం.
– కిశోర్‌కుమార్, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్, నిర్మల్.