కోటపల్లి/భీమిని/చెన్నూర్ రూరల్/హాజీపూర్/ కాసిపేట/కౌటాల/చింతలమానేపల్లి, సెప్టెంబర్ 18 : యూరియా కోసం రైతాంగం ఆగమవుతున్నది. పంట ఎదిగే సమయంలో ఎరువులు దొరకక అవస్థలు పడుతున్నది. సర్కారు నిర్లక్ష్యంపై విసిగిపోయి ఆందోళనలు చేపడుతున్నది. గురువారం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద 444 బస్తాలు మాత్రమే పంపిణీ చేయగా, దొరకని రైతులు రోడ్డుపై బైఠాయించారు.
సీఐ బన్సీలాల్, ఏవో మార్క్ గాడ్కన్, ఏఈవోలు రైతులకు నచ్చజెప్పి టోకెన్లు అందజేశారు. ఇక మల్లంపేట రైతువేదికలో 888 బ్యాగ్‌లు పంపిణీ చేయగా, బస్తాలు రాని కర్షకులు ఆందోళనకు దిగారు. సిర్సా రైతు వేదిక వద్ద రైతులు చెప్పుల వరుస పెట్టి టోకెన్లు పొందారు. కోటపల్లి ఎస్ఐ రాజేందర్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వెలమపల్లి రైతువేదికలో 444 బ్యాగ్‌లు పంపిణీ చేయగా, రైతులు బారులు తీరారు.
భీమిని మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయానికి 260 యూరియా బస్తాలు రాగా, ఉదయం ఆరింటి నుంచే రైతులు క్యూ కట్టారు. తోపులాట జరగగా, ఏడీఏ సురేఖ రైతులతో వాగ్వాదానికి దిగారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆమె చెప్పడంతో రైతులు ఆగ్రహించి ఆందోళనకు దిగారు. వార్త కవరేజీ కోసం వెళ్లిన ‘నమస్తే తెలంగాణ’ విలేకరిని మీకు ఇక్కడ ఏం పని అంటూ దురుసుగా ప్రవర్తించారు.
తాండూర్ సీఐ దేవయ్య, భీమిని ఎస్ఐ విజయ్‌కుమార్ చొరవ తీసుకుని రైతులకు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. చెన్నూర్ మండలం ఎర్రగుంటపల్లి, శివలింగాపూర్, కొమ్మెర, అంగ్రాజ్‌పల్లి గ్రామాల రైతులకు ఏడీఏ బానోత్ ప్రసాద్, ఏవో యామిని, ఏఈవో సాగర్, రాజశేఖర్, అర్చన యూరియా పంపిణీ చేశారు. ఎస్ఐ సుబ్బారావు, శ్యాం పటేల్ ఆద్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. 600 మంది రైతులు క్యూ కట్టగా, 222 మందికి మాత్రమే యూరియా ఇవ్వడంపై రైతులు ఆందోళన చేపట్టారు.
పోలీసులు నచ్చజెప్పారు. ఎర్రగుంటపల్లి, కొమ్మెర గ్రామాలకు చెందిన రైతులకు కొమ్మెరలో టోకెన్లు ఇచ్చి.. ఆస్నాద్లోని రైతు వేదిక వద్ద పంపిణీ చేయగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు కిలో మీటర్ల దూరంలోనున్న ఆస్నాద్కు వచ్చి యూరియా తీసుకోవాలా.. అంటూ వ్యవసాయ శాఖ అధికారులను నిలదీశారు. ఇక గుడిపేట రైతువేదిక వద్ద ఉదయం నుంచి రైతులు బారులు తీరారు. మధ్యాహ్నం యూరియా లోడ్ రాగా, టోకెన్లు తీసుకున్న రైతులకే మాత్రమే పంపిణీ చేయడంతో మిగతా వారు నిరాశతో వెనుదిరిగారు. ఎస్ఐ స్వరూప్ రాజ్ బందోబస్తు నిర్వహించారు.
కాసిపేట మండలం ముత్యంపల్లి, మల్కెపల్లిలో ఒక్కొక్కరికీ ఒకే యూరియా బస్తా ఇవ్వడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సర్కారులోనే ‘మంచిగుండే’ అంటూ అక్కడ రైతులు మాట్లాడుకోవడం కనిపించింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని పోచమ్మ ఆలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో రైతులు భారీ ర్యాలీ తీశారు. వారు మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతు గోస పట్టించుకోకుండా.. నాయకులు రైళ్లు, ప్రాజెక్టులు.. అంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ సర్కారులో రైతులు ఏనాడూ యూరియా కోసం ఇబ్బందులు పడ్డది లేదన్నారు. అనంతరం సరిపడా యూరియా పంపిణీ చేయాలంటూ ఎంఆర్ఐ దిలీప్‌కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొమురం మాంతయ్య, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్‌లు మడావి రేణుక, మెర్పెల్లి బ్రహ్మయ్య, శ్రీనివాస్, లహాంచు, మాజీ ఎంపీటీసీలు మనీష్, వసంత్‌రావు ఉన్నారు.
చింతలమానేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ నుంచి శివాజీ చౌక్ వరకు నాయకులు, రైతులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ వెంకటేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆర్టీసీ అధికారులు రోడ్డు బాగలేదని గూడెం వరకూ ఆర్టీసీ బస్సు సౌకర్యం నిలిపివేశారంటూ ప్రజలు ఫ్లెక్సీ పట్టుకొని ర్యాలీ తీశారు. గూడెం రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. పనులు పూర్తి చేయకపోతే బీజేపీ ఎమ్మెల్యే హరీశ్‌బాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.