బషీరాబాద్, మే 31 : మిల్లర్ల పేరు చెప్పి కొనుగోలు కేంద్రం నిర్వాహకులు మోసం చేస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తేమ, తాలు పేరుతో కిలోన్నర ధాన్యాన్ని ఎక్కువగా తూకం చేశారని, ఈ లెక్కన 300 క్వింటాళ్ల ధా న్యాన్ని అదనంగా సేకరించారని.. ఈ 300 క్వింటాళ్ల ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర రూ. 2,320తో లెక్కిస్తే దాదాపు రూ. 6,96,000 అవుతుందని, ఈ డబ్బంతా ఎవరి జేబులోకి వెళ్లిందని ప్రశ్నిస్తున్నారు. కాశీంపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రంలో బస్తాకు 42 కిలోల 500 గ్రాముల ధా న్యాన్ని తూకం చేస్తూ బస్తాకు కిలోన్నర ధాన్యా న్ని అదనంగా తీసుకుంటున్నారని రైతులు పేర్కొంటున్నారు.
నిబంధనల ప్రకారం తేమ శాతం 17 ఉంటే బస్తాకు 40 కిలోల600 గ్రాముల ధాన్యాన్ని తూకం చేయాలి. అలా కాకుండా కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తాలు, తేమ పేరుతో 42 కిలోల 500 గ్రాముల ధాన్యాన్ని అదనంగా తూకం చేస్తున్నారు. ఇదేంటని వారిని ప్రశ్నిస్తే.. మీ వడ్లు బాగా లేవు..రైస్‌మిల్లుల వారు తీసుకోరని చెబుతున్నారని అన్నదాతలు వాపోతున్నారు. లేదంటే తూకం చేయకుండా రోజుల తరబడి అలాగే ఉంచుతున్నారని.. దీంతో చేసేదేమీ లేక కేంద్రం నిర్వాహకులు చెప్పినట్లే చేస్తున్నట్లు పేర్కొంటున్నారు.
కాశీంపూర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రం ద్వా రా ఇప్పటివరకు దాదాపు 20,000 ధాన్యం బస్తాలను సేకరించినట్లు నిర్వాహకులు తెలిపా రు. ఇంకా కేంద్రంలో 6,000 బస్తాల వరకు ధా న్యం ఉంటుందని పేర్కొంటున్నారు. కాగా, 20,000 బస్తాలకు కిలోన్నర చొప్పున అదనం గా ధాన్నాన్ని లెక్కిస్తే 300 క్వింటాళ్లు వస్తుంది.
తనతోపాటు మరో ఎనిమిది మంది రైతులకు సంబంధించిన ధాన్యాన్ని గత నెల 23వ తేదీన నిర్వాహకులు లారీలో రైస్‌మిల్లుకు తరలించారు. మూడు రోజుల తర్వా త బిల్లు కోసం నిర్వాహకుల వద్దకు వెళ్తే.. మీ ధాన్యం మంచిగా లేదని, మిల్లర్లు తీసుకోవడంలేదని చెప్పడమే కాకుండా.. క్వింటాకు ఏడు కిలోల చొప్పున ధాన్యాన్ని కట్ చేసి బిల్లు చేస్తామన్నారు. బస్తాకు కిలోన్నర కాకుండా మళ్లీ ఏడు కిలోలు కట్ చేస్తే ఒప్పుకునేది లేదని చెప్పి తిరిగి వచ్చేశాం.
-బాబు షరీఫ్ కాశీంపూర్
నా ధాన్యం 17% తేమ వచ్చినా 42 కిలో ల 500 గ్రాముల చొప్పున తూకం చేశా రు. ఎందుకు అని అడిగితే ఎవరికీ చెప్పుకుంటావో చెప్పుకో అని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ధాన్యాన్ని తూకం వేసేందుకు 15 రోజుల కిందట తీసుకొచ్చా. కొనుగోళ్లలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడి సిబ్బంది పట్టించుకోవడంలేదు.
-విఠల్, రైతు, కాశీంపూర్ తండా