ఖరీఫ్ సీజన్ పత్తి రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నది. ప్రారంభంలో దుక్కి దున్ని విత్తనం పెట్టిన రైతుకు సకాలంలో వర్షాలు కురియక మొలకెత్తక నానా అవస్థలు పడ్డారు. పంట చేతికందే సమయంలో మొంథా తుఫాన్ ప్రభావంతో పక్షం రోజులపాటు కురిసిన అధిక వర్షాల కారణంగా పత్తి కాయలు నేల రాలగా.. మరి కొందరి రైతుల పత్తి నల్లబారింది. దీంతో దిగుబడి పడిపోయింది. పెట్టిన పెట్టుబడి రాక రైతులు పత్తి చేలను దున్నేస్తుండగా, మరికొందరు రైతులు గొర్రెలు, మేకలకు మేతకు వదిలివేసి ప్రత్యామ్నాయ పంటలైన జొన్న, పెసర, మొక్కజొన్న, నువ్వుల పంటల వైపు చూస్తున్నారు. ఎకరం పత్తి చేనులో 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి రావల్సి ఉండగా.. 4 నుంచి 5 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. నిర్మల్ జిల్లాలో 1,50,655 హెక్టారుల్లో 65,271 మంది రైతులు పత్తి సాగు చేస్తున్నారు.
– దిలావర్పూర్, నవంబర్ 23
నేను వానకాలంలో ఎనిమిదెక రాల్లో పత్తి సాగు చేశా. మొద ట కురిసిన వర్షాలకు పత్తి విత్తనాలు విత్తా. తర్వాత వర్షాలు సక్రమంగా కురియ కపోవడంతో మొలకెత్తలేదు. మళ్లీ విత్తనాలు విత్తగా మొలకె త్తాయి. పంట మంచిగా ఉన్నదని సంబుర పడ్డా. చేతి కందే సమయంలో పక్షం రోజులు కురిసిన అధిక వర్షాలకు పత్తి నల్లబడ్డది. వానకు మొకిరే రాలిం ది. పత్తి కాయలు పక్వానికి రాక రాలాయి. ఎకరం పంటకు ట్రాక్టర్, విత్తనాలు, పురుగుల మందులు, కలు పుతీతకు కలిపి రూ.25వేలు ఖర్చు చేసిన. ఎనిమిదెక రాలకు రూ.1.60 లక్షలు ఖర్చు చేశా. యేటా ఎకరం పత్తి చేను లో 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. ఈ యేడు ఎకరాకు ఐదు క్వింటాళ్లే వచ్చింది. పెట్టుబడి పైసలు కూడా ఎల్లడం కష్టంగా ఉంది. పత్తిని దున్ని మొక్కజొన్న వేసిన.
– గంగారెడ్డి, రైతు, గుండంపల్లి.