ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, సెప్టెంబర్ 29 : లైంగిక దాడికి గురైన బాలిక కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కార్పొరేట్ పాఠశాలలో చేర్చి మెరుగైన విద్యనందించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. ఆదివారం బూరుగూడలో బాలిక కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని, పల్లెల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహించడం వల్ల యువత మద్యానికి బానిసై ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని, వెంటనే బెల్ట్ షాపులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో బూరుగూడ మాజీ సర్పంచ్ చౌదరి గోపాల్, బీఆర్ఎస్ నాయకుడు ఇర్దండి వినోద్ ఉన్నారు.