మంచిర్యాల ఏసీసీ, మే 14 : ‘కూలీ పనులు చేసుకొని బతికేటోళ్లం.. బుక్కెడు బువ్వ పెట్టేటోళ్లను పోగొట్టుకున్నం.. మీకు దండం పెడు తం.. న్యాయం చేయండి’ అంటూ గురువా రం ప్రహరీ కూలీ మృతి చెందిన గోళెం పో శం, హన్మంతు, ఆత్రం శంకర్ కుటుంబాల స భ్యులు ధర్నాకు దిగారు. ఈ మేరకు శుక్రవా రం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన సమీపంలోని ఐబీ చౌరస్తాలో బంధువులు, కార్మిక సంఘాల నాయకులు బై ఠాయించారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల దాకా ఆందోళన కొనసాగింది. ఏ సీపీ ప్రకాశ్, సీఐ బన్సీలాల్, ఎస్ఐలు ఘట నా స్థలానికి చేరుకొని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు.
న్యాయం జరిగే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. మంచిర్యాల ఎమెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అక్కడికి చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. చివరకు ఎమ్మెల్యేలు, పోలీసులు జోక్యంతో ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.6.50 లక్షల చొప్పున ఇచ్చేందుకు, గాయపడ్డ మైదం రాములు కుటుంబానికి రూ.2 లక్షలు అందించేందుకు భవనం యజమాని ఒప్పుకోవడంతో ఆందోళన విరమించారు.
ప్రహరీ కూలి చింతలమానేపల్లి మండల కేంద్రానికి చెందిన గోళెం పోషం, రుద్రాపూర్‌కు చెందిన హన్మంతు, బాబాపూర్‌కు చెందిన ఆత్రం శంకర్ మృతి చెందగా, ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాలను గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పోస్టుమార్టం కోసం మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఆయా సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. బంధువుల రోదనలు అక్కడున్న వారిని కలచి వేశాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.