బదిలీల ‘పంచాయితీ’ ముదిరి పాకాన పడింది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని కొందరు అధికారులు నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నప్పటికీ, తాజా బదిలీల్లో అక్కడి నుంచి కదలకపోవడం విమర్శలకు తావిస్తున్నది. స్థానచలనం నుంచి తప్పించుకునేందుకు అడ్డదారులు సైతం తొక్కుతున్నట్లు తెలుస్తున్నది. ఇక మారుమూల జిల్లాల్లో పనిచేస్తూ.. బదిలీ కావాల్సిన తమకు అన్యాయం జరుగుతుందంటూ ఆ శాఖలోని ఇతర ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేయడం కనిపిస్తున్నది.
మంచిర్యాల జిల్లా పంచాయతీరాజ్‌శాఖలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగి ఒకరు బదిలీ నుంచి తప్పించుకునేందుకు తప్పుడు జాయినింగ్ రిపోర్టులు సమర్పించారన్న విమర్శలున్నాయి. గతంలో ఆదిలాబాద్ జిల్లాలో పనిచేసిన ఆ ఉద్యోగి బదిలీపై మంచిర్యాలకు వచ్చి పదోన్నతి పొందారు. నిబంధనల మేరకు నాలుగేళ్లు పని చేయడంతో తప్పనిసరిగా సదరు అధికారి బదిలీ కావాలి. కానీ, బదిలీ నుంచి తప్పించుకునేందుకు మంచిర్యాలలో 3 రోజులు ఆలస్యంగా జాయిన్ అయినట్టు తప్పుడు రిపోర్టు సమర్పించి, సదరు అధికారి బదిలీ నుంచి తప్పించుకున్నారని ఆ శాఖలో పనిచేసే ఇతర ఉద్యోగులే చెబుతున్నారు. అప్పుడున్న డీపీవో రిపోర్టుకు, సదరు ఉద్యోగి సమర్పించిన జాయినింగ్ రిపోర్టుకు సంబంధమే లేదు. మంచిర్యాలలో జాయిన్ కావడానికి ముందు రెండు రోజులు ఆదిలాబాద్‌లో పని చేశానని, జీతం కోసమే 1వ తేదీన ఇక్కడ చేరినట్లు చూపించానని సదరు ఉద్యోగి చెబుతున్నా, ఈ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు ఉద్యోగి జాయినింగ్ రిపోర్ట్ తప్పు చూపిస్తే, అడ్డుకోవాల్సిన ఆ శాఖ, జిల్లా ఉన్నతాధికారి ఎందుకు మౌనంగా ఉండిపోవడం, ఆ ఉద్యోగికి వెన్నుదన్నుగా నిలవడంపై పలువురు మండిపడుతున్నారు. ఇక పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తున్న మరో సీనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగికి నాలుగు సంవత్సరాల సర్వీస్ ఆ జిల్లాలోనే పూర్తయింది. కానీ యూనియన్ ప్రతినిధిగా చెప్పుకొని ఆయన బదిలీ నుంచి మినహాయింపు పొందినట్టు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం తప్పనిసరిగా బదిలీ కావాల్సిన అధికారులకు యూనియన్ నాయకత్వం ఇంతగా ఎందుకు సపోర్ట్ చేస్తున్నది, ఒకరి స్వార్థం కోసం యూనియన్‌లో మిగిలిన ఉద్యోగులకు అన్యాయం చేస్తారా అంటూ ఆ శాఖ ఉద్యోగులే పెదవి విరుస్తున్నారు.
బదిలీ కావాల్సిన అధికారులు ఇలా పాతుకుపోతుండడంతో అనేక సంవత్సరాలుగా మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాల్లో పనిచేస్తూ బదిలీ కోసం ఎదురు చూస్తున్న అర్హులైన ఉద్యోగులకు అన్యాయం జరుగుతున్నది. బదిలీతో కుటుంబాలకు దగ్గరగా వెళ్లాలన్న వారి ఆశలు నీరుగారి పోతున్నాయి. ఉదాహరణకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దాదాపు ఆరేళ్లుగా పనిచేస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్ తప్పనిసరి నిబంధన మేరకు బదిలీ కావాల్సి ఉంది. కానీ, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఆయన కేడర్ స్థాయి ఉద్యోగులు లేని కారణంగా ఆయనకు బదిలీ ఆప్షన్ లేకుండా పోయింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో నాలుగేండ్లకు పైగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులదీ ఇదే పరిస్థితి ఉన్నది. మే-31వ తేదీ దాటితే సర్కారు సాధారణ బదిలీలపై నిషేధం విధించనున్న నేపథ్యంలో.. ‘మాకు అన్యాయం జరిగితే మళ్లీ సర్కారు బదిలీలకు అనుమతించే వరకూ ఎన్నేండ్లయినా మారుమూల ప్రాంతాల్లో, కుటుంబాలకు దూరంగా, అత్యవసర వైద్య సేవలకు దూరంగా మగ్గాల్సిందేనంటూ’ పలువురు వాపోతున్నారు. పారదర్శకంగా బదిలీలపై దృష్టి సారించాలని ఉన్నతాధికారులను కలిసి విన్నవించినా పట్టించుకునే నాథుడు లేకుండా పోయారంటూ బాధపడుతున్నారు. సాధారణ బదిలీల్లో ఉద్యోగులకు ఇంత అన్యాయం జరుగుతున్నా, ఆ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మంచిర్యాల జిల్లాకు సంబంధించి పంచాయతీ కార్యదర్శుల బదిలీల్లోనూ అధికారులు నిబంధనలకు పాతర వేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో మొత్తం 308 గ్రామ పంచాయతీలు ఉండగా, 300 మంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రతీ జిల్లాలో 40శాతం మేర పంచాయతీ కార్యదర్శలు బదిలీ కావాలి. ఈ మేరకు జిల్లాలో 97 మంది పంచాయతీ కార్యదర్శులు బదిలీ కావాల్సి ఉండగా, ఇందులో దాదాపు 80 మంది దాకా పైరవీ లెటర్లు, ఎమ్మెల్యేల పీఏల రికమెండేషన్లతో పోస్టింగ్ కోసం వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతో వచ్చిన వారికి బదిలీల్లో పెద్దపీట వేసినట్లు ప్రచారం జరుగుతున్నది. నిబంధనల ప్రకారం సీనియారిటీ, స్పౌజ్ కేసులు, రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వారికి బదిలీల్లో ప్రియార్టీ ఇవ్వాలి. కానీ పైరవీ బలంగా ఉన్నోళ్లకు సీనియారిటీ లిస్టుతో సంబంధం లేకుండానే పోస్టింగ్లిచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా ట్రాన్స్ఫర్లు చేశారని పలువురు పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పలు పత్రికల్లో కథనాలు వచ్చినా పరిస్థితి మారలేదని చెబుతున్నారు. ఈ నెలాఖరుతో ట్రాన్స్ఫర్ల ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని వెలుగులోకి తేవాలని పలువురు కోరుకుంటున్నారు. ఉన్నతాధికారులేమో పోస్టింగ్‌లకు తీవ్రమైన ఒత్తిడి ఉండటంతో తప్పడం లేదని విస్తుపోతున్నట్లు తెలిసింది. మందమర్రి మండలంలోని ఓ గ్రామ పంచాయతీకి సంబంధించి ఓ నేత దాదాపు 10 మంది పంచాయతీ కార్యదర్శులకు రికమండేషన్ లెటర్లు ఇచ్చినట్లు సమాచారం. ఈ స్థాయి రికమెండేషన్లు వస్తుండటంతో ఏం చేయాలో తెలియక ఉన్నతాధికారులు చేతులెత్తేశారని వినికిడి. మొత్తానికి ఈ నెలాఖరుతో బదిలీల ప్రక్రియ ముగుస్తుందన్న సమయంలో పంచాయతీరాజ్ శాఖపై ఇలాంటి ఆరోపణలు రావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.