మంచిర్యాల, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గ్రామ పంచాయతీల పాలన పూర్తిగా పడకేసింది. పాలక వర్గాలు లేకపోవడం, స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణ కరువవడం, మండల పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడం కొందరు పంచాయతీ కార్యదర్శులకు వరంగా మారింది. దీంతో గ్రామాల్లో విధులకు హాజరుకాకుండానే ముఖ గుర్తింపు(ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్) యాప్‌తో విధులకు వచ్చినట్లు ఫేక్ డీఎస్ఆర్ అటెండెన్స్ నమోదు చేస్తున్నారు. డ్యూటీకి రాకుండా ఎక్కడో ఉండి కేవలం ఫొటోలు అప్లోడ్ చేస్తున్నారు. ఇటీవల జగిత్యాల జిల్లాలో ఓ కార్యదర్శి తనకు బదులు సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోలను యాప్‌లో అప్లోడ్ చేసి విధులకు వచ్చినట్లు ఫేక్ అటెండెన్స్ వేసుకున్నాడు.
ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల్లో పంచాయతీ కార్యదర్శుల అటెండెన్స్‌ను పరిశీలించాలంటూ ఆదేశించారు. అధికారుల తనిఖీల్లో చాలా మంది ఫేక్ డీఎస్ఆర్ అటెండెన్స్ వేసినట్లు గుర్తించడం గమనార్హం. మంచిర్యాల జిల్లాలో 21 మంది, నిర్మల్ జిల్లాలో ఐదుగురు, ఆదిలాబాద్ జిల్లాలో 21 మంది పంచాయతీ కార్యదర్శులు ఇలా చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో 21 మంది షోకాజ్ నోటీసులు ఇవ్వడంతోపాటు ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యశ్వంత్‌గూడ పంచాయతీ కార్యదర్శిని విధుల నుంచి సస్పెండ్ చేశారు.
మరో నలుగురిపై చర్యలకు సిఫార్సు చేయనున్నట్లు తెలిసింది. షోకాజ్ నోటీసులు తీసుకున్న పంచాయతీ కార్యదర్శులు మూడు రోజుల్లో ‘విధులపై ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.’ అన్న దానిపై ఉన్నతాధికారులకు వివరణ ఇవ్వాలి. లేని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని ఉన్నతాధికారులు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలోనూ ఈ తరహా పంచాయతీ కార్యదర్శులను గుర్తించినప్పటికీ, ఉన్నతాధికారులు అందుబాటులో లేని దృష్ట్యా నోటీసులు ఇవ్వలేదని తెలిసింది.
పంచాయతీల్లో పాలకవర్గాలు లేనప్పటి నుంచి కొందరు పంచాయతీ కార్యదర్శులు విధులపై తీవ్రమైన అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేక అధికారులను నియమించినా పర్యవేక్షణ ఉండడం లేదు. సాధారణంగా మండల పంచాయతీ అధికారి(ఎంపీవో) నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ, పర్యవేక్షించాలి. కానీ.. క్షేత్రస్థాయిలో అలాంటిది కనిపించడం లేదు. దీంతో కొందరు పంచాయతీ కార్యదర్శులు అటెండెన్స్(హాజరు)ను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్‌లోని లొసుగులను అడ్డుపెట్టుకుని విధులకు వెళ్లకుండానే అటెండెన్స్ వేసుకుంటున్నారు. రోజూ విధులు నిర్వర్తిస్తున్న గ్రామానికి వెళ్లి ఆన్లైన్లో ఫొటో దిగి అప్లోడ్ చేయాలి.
అప్పుడే పంచాయతీ కార్యదర్శికి ప్రజెంట్(హాజరు) నమోదు అవుతుంది. కొందరు కార్యదర్శులు విధులకు వెళ్లకుండా ఇతరుల సాయంతో లేదా పంచాయతీల్లోని మల్టీ పర్పస్ వర్కర్స్ సాయంతో యాప్‌లో పాత ఫొటోలను అప్లోడ్ చేయిస్తున్నారు. కొందరు గ్రామానికి వెళ్లకుండానే ఫొటోలు అప్లోడ్ చేసి హాజరు నమోదు చేయించుకుంటున్నారు. కొందరు పంచాయతీ కార్యదర్శులు తాము వెళ్లకుండా ఖాళీ కుర్చీల ఫొటోలను అప్లోడ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. యాప్‌లో లైవ్ ఫొటోలు కాకుండా పాత ఫొటోలను అప్లోడ్ చేసే అవకాశం ఉండడంతో పంచాయతీ కార్యదర్శులు ఇష్టారాజ్యంగా అటెండెన్స్ వేసుకుంటున్నారు.
వాస్తవానికి పంచాయతీ కార్యదర్శులు ఫేక్ డీఎస్ఆర్ అటెండెన్స్ వేసుకుంటున్న విషయాన్ని జిల్లా అధికారులు గుర్తించలేదు. జగిత్యాలలో వెలుగు చూసిన సీఎం ఫొటోలు పెట్టి అటెండెన్స్ వేసుకున్న ఘటన నేపథ్యంలో అన్ని జిల్లాల్లో హాజరును తనిఖీ చేయాలంటూ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఆదేశాలు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో 21 మందికి సంబంధించి.. కోటపల్లి-5, వేమనపల్లి-4, భీమిని-4, కన్నెపల్లి-2, కాసిపేట-2, భీమారం, జైపూర్, దండేపల్లి, బెల్లంపల్లిలో ఒకరి చొప్పున కార్యదర్శులకు నోటీసులు ఇచ్చారు. ఇదే సమయంలో లక్షెట్టిపేట మండలంలో విధులను నిర్లక్ష్యం చేసిన పంచాయతీ కార్యదర్శులను మాత్రం షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా వారిని తప్పించారు. దీనిపై ఉన్నతాధికారులను వివరణ కోరగా.. రెండు, మూడు రోజులు ఫేక్ అటెండెన్స్ వేసిన వారికి వార్నింగ్ ఇచ్చి మినహాయింపు ఇచ్చినట్లు చెప్పారు.
అంతకంటే ఎక్కువ రోజులు ఫేక్ హాజరు వేసిన వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు. అంటే రెండూ, మూడు రోజులు ఫేక్ అటెండెన్స్ వేసినా తప్పుకాదు అని ఓ ఉన్నతాధికారి చెప్పడం ఇక్కడ గమనార్హం. లక్షెట్టిపేట మండలంలో రంగపేట పంచాయతీ కార్యదర్శి ఒక రకమైన మూడు ఫొటోలతో తొమ్మిది రోజులు ఫేక్ అటెండెన్స్ వేశాడు. తిమ్మాపూర్ పంచాయతీ కార్యదర్శి నాలుగు రోజులు ఒకే ఫొటో అప్లోడ్ చేసి ఫేక్ అటెండెన్స్ వేశారు. ఇలా మండలంలో మరో గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఇదే తరహాలో ఫేక్ డీఎస్ఆర్ అటెండెన్స్ వేసినట్లు గుర్తించినా, వారికి నోటీసులు ఇవ్వలేదు.
మూడు, నాలుగు రోజులు మినహాయింపు ఇచ్చిన అధికారులు తొమ్మిది రోజులు ఫేక్ అటెండెన్స్ వేసిన రంగపేట పంచాయతీ కార్యదర్శిని ఎందుకు వదిలేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో జిల్లా ఉన్నతాధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక రోజు చేసినా, రెండు రోజులు చేసినా అది తప్పు కాకుండా పోతుందా? ఇలా వదిలేస్తే భయం ఎలా ఉంటుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.
వివక్ష చూపించకుండా ఫేక్ డీఎస్ఆర్ అటెండెన్స్ వేసిన ప్రతి ఒక్క పంచాయతీ కార్యదర్శికి నోటీసులు ఇవ్వాలని, వారిచ్చే వివరణతో వదిలి వేయకుండా మరోసారి విధులను ఇలా నిర్లక్ష్యం చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు పంచాయతీ కార్యదర్శులే డిమాండ్ చేస్తున్నారు. ఒక్క లక్షెట్టిపేట మండలంలోనే ఇలా తప్పించారా? లేక జిల్లా మొత్తం ఇలా కొందరిపైనే చర్యలు తీసుకుని మరికొందరిని వదిలేశారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది.