నిర్మల్ టౌన్, మార్చి 28 : వైద్య విద్యను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వైద్య కళాశాలలను ఏర్పాటు చేసిందని, వాటిలో అన్ని వసతులు కల్పించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్లకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి నాయకత్వంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశామని చెప్పారు. గతేడాది రికార్డుస్థాయిలో ఎనిమిది కళాశాలలను ప్రారంభించుకున్నామని, ఈ ఏడాది మరో తొమ్మిది ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ పరిధిలో ఐదు వైద్య కళాశాలలు, 1,170 ఎంబీబీఎస్ సీ ట్లు ఉండగా.. ఇప్పుడు 12 వైద్య కళాశాలలు అదనంగా ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
దీనివల్ల 2,545 మందికి వైద్య విద్య అం దే అవకాశం ఉందన్నారు. కరీంనగర్, కామారెడ్డి, జనగాం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో వైద్య కళాశాలల పనుల పురోగతి, మౌళిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై నివేదికలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలను తనిఖీ చేసేందుకు బృందం వస్తున్నందున అక్కడ కళాశాల నిర్వహణపై ఏర్పాట్లు, బెడ్లు, ఇతర సిబ్బంది పనితీరు, తదితర అంశాలను వివరించాలని సూచించారు. నిర్మల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలో వంద పడకల దవాఖాన సిద్ధంగా ఉందని, మరో 125 అదనపు పడకలతో రూ.12 కోట్లతో భవన నిర్మాణం పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. మే 15లోపు పనులన్నీ పూర్తి చేసి అన్ని వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాంబాబు, జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్, దవాఖాన సూపరింటెండెంట్ దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.