ఎదులాపురం, మే 29 : పత్తి విత్తనాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం పట్టణంలోని విత్తనాల షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాశీ 659 రకం కోసం రైతులు ఉ దయం నుంచే బారులు తీరుతున్నారనే విషయాన్ని తెలుసుకు న్న కలెక్టర్ దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. షాపులకు వచ్చిన స్టాక్, రైతులకు విక్రయించిన వివరాలను డీలర్లను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రైతులకు ఒకే రకమైన పత్తి విత్తనాలు కాకుండా ప్రభుత్వం గుర్తింపు ఉన్న విత్తనాలను వాడాలని సూచించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఒకే రకమైన పత్తి విత్తనాలను అడగడం, చుట్టూ పక్కల మండలాల్లో దుకాణాలు ఉన్నా.. గతేడాది తీసుకున్న దుకాణాల్లోనే కొనుగోలు చేసేందుకు వస్తున్నారన్నారు. దీని కారణంగా రద్దీ పెరుగుతుందన్నారు. ఎండల నేపథ్యంలో షాపుల వద్ద తాగునీరు సౌకర్యాలు కల్పిస్తామని, టెంట్లు కూడా వేస్తామన్నారు. ఈ సంవత్సరం 4 లక్షల ఎకరాల వరకు పత్తి సాగయ్యే అవకాశాలున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేసిందన్నారు. తగ్గట్లుగానే 55 కంపెనీలతో మాట్లాడి 125 రకాల పత్తి విత్తనాలను 10 లక్షల ప్యాకెట్లు అవసరం ఉండగా.. ఎనిమిది లక్షల వరకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మిగతావి ఈనెల చివరి వరకు వస్తాయన్నారు. రైతులు అధైర్య పడొద్దని సూచించారు. ఎండల కారణంగా దుకాణాలు కూడా ఉదయం 7 గంటలకే తెరిచేలా డీలర్లతో సమావేశం నిర్వహించి ఆదేశాలు ఇస్తామన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయశాఖ అధికారి పుల్లయ్య ఉన్నారు.
ఆదిలాబాద్‌లోని గాంధీచౌక్, అంబేద్కర్‌చౌక్ మధ్యలో గల విత్తనాల షాపులను ఎస్పీ గౌష్ ఆలం బుధవారం పరిశీలించారు. విత్తనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. షాపుల వద్ద క్యూలైన్లను దృష్టిలో పెట్టుకుని బందోబస్తు ఏర్పాటు చే యడం జరిగిందన్నారు. అన్ని షాపుల వద్ద సరైన క్రమబద్ధీకరణతో కూడిన వరుస క్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాల అడ్డుకట్టకు బృందాలను ఏర్పాటు చేసి, తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో రెండ్రోరోజుల క్రితం పట్టణంలో రూ.19 లక్షల విలువ గల విత్తనాలను పట్టకున్నామని తెలిపారు. ఎస్పీ వెంట డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐ సత్యనారాయణ ఉన్నారు.