తలమడుగు, సెప్టెంబర్ 27 : రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కుచులాపూర్కు చెందిన దాదాపు 200 మందికిపైగా రైతులు శనివారం అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గ్రామం నుంచి అంతర్రాష్ట్ర రహదారి వరకు ర్యాలీగా వచ్చి రోడ్డుపై ఉదయం 10.30 గంటల నుంచి దాదాపు 11.30 గంటల వరకు బైఠాయించారు.
ఈ రాస్తారోకోకు బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలిపారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకొని ఘటన స్థలానికి ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిందర్, ఎస్సై రాధిక, ఏఈవో సతీశ్ చేరుకొని రైతులతో మాట్లాడారు. సరిపడా యూరియా ఇప్పిస్తామని చెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించారు.
పత్తి పూత కాత దశలో ఉంది. సరిపడా ఎరువులు అందిస్తే దిగుబడి ఎక్కువ వస్తుంది. సమయానికి యూరియా అందక ఇబ్బందులు పడుతున్నం. కేసీఆర్ హయాంలో రైతులకు ఇబ్బందులు లేకుండే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కోసం రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా అధికారులు సరిపడా యూరియా అందించాలి. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తాం.
– తోట శ్రీనివాస్, రైతు, కుచులాపూర్.