ఆ మార్గంలో ఆర్టీసీ బస్సు సేవలు నిలిచిపోయి ఆరునెలలు దాటింది. 10 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. ఆ రూట్లో ఏ ఒక్క మహిళకూ ఉపయోగం లేకుండా పోయింది. ‘జర మా సమస్య పట్టించుకోండి సారూ..’ అని సాక్షాత్తూ ఎమ్మెల్యే వివేక్‌కు వినతి పత్రం ఇచ్చినా ఫలితం మాత్రం కానరాలేదు.
కోటపల్లి, డిసెంబర్ 15 : మండలంలోని జనగామ రూట్లో ఆర్టీసీ బస్సు సేవలకు మోక్షం కలగడం లేదు. రోడ్డు బాగా లేదన్న సాకుతో పారుపల్లి, లింగన్నపేట, ఎదుల్లబం ధం, సిర్సా, రొయ్యలపల్లి, పుల్లగామ, ఆలుగామ, జనగామ, సూపాక, నందరాంపల్లి గ్రామాల వైపు ఆరు నెలలుగా ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తున్నది.
తీగల ఎత్తు పెంచితేనే..
పారుపల్లి-లింగన్నపేట గ్రామాల మధ్యన ఉన్న ఒర్రెపైన బ్రిడ్జి నిర్మాణం చేపట్టగా, ఆ బ్రిడ్జి పై నుంచి 33 కేవీ, 11 కేవీ, ఎల్టీ విద్యుత్ లైన్లు ఉన్నాయి. ఆ మార్గంలో బస్సు నడిపిస్తే విద్యుత్ తీగలు తగిలే ప్రమాదముందని ఆర్టీసీ చెబుతున్నది. విద్యుత్ తీగలు సరిచేస్తే బస్సు నడిపిస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతుండగా, ఆర్అండ్బీ అధికారులు తమ సంస్థకు డబ్బులు చెల్లిస్తేనే సరి చేస్తామని విద్యుత్ అధికారులు అంటున్నారు. ఇక ఈ విషయమై ఆర్అండ్బీ అధికారులను అడిగితే తీగలు సరి చేసేందుకు విద్యుత్ శాఖ అత్యధిక అంచనాలు వేసిందని, ఆ డబ్బు ఇప్పుడు చెల్లించలేమని అంటున్నారని ఈ ప్రాంత నాయకులు చెబుతున్నారు. శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, సమస్యను పరిష్కరించే నాథుడు లేకపోవడంతో 10 గ్రామాల ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తూ రెట్టింపు ఛార్జీలు చెల్లించి మరీ ప్రయాణిస్తున్నారు.
ఎమ్మెల్యేకు చెప్పినా ఫలితం శూన్యం
జనగామ రూట్లో బస్సు నడవక ప్రజలు, మహిళలు పడుతున్న ఇబ్బందులను కోటపల్లి మండల వైస్ ఎంపీపీ, మాజీ సర్పంచ్ గట్టు లక్ష్మణ్ గౌడ్, ఆలుగామ మాజీ సర్పం చ్ కుమ్మరి సంతోష్, రాజారం మాజీ ఎంపీటీసీ, గిరిజన నాయకులు జేక శేఖర్, యువ కాంగ్రెస్ నాయకులు దాగామ శ్రీశైలం నవంబర్ 21న చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వివేక్‌కు వినతి పత్రం అందజేశారు. నేరుగా ఎమ్మెల్యేకు చెప్పడంతో సమస్య పరిష్కారమవుతుందని భావించిన స్థానిక నాయకులు, ప్రజలకు నిరాశే ఎదురైంది. స్వయంగా ఎమ్మెల్యేకు సమస్య విన్నవించినా పరిష్కారానికి నోచుకోవడం లేదంటే.. ఇక ఎవరూ పట్టించుకుంటారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డబ్బులు చెల్లిస్తే తీగల ఎత్తు పెంచుతాం
పారుపల్లి-లింగన్నపేట గ్రామాల మధ్యన కల్వర్టు నిర్మించిన చోట విద్యుత్ తీగలు కిందకు ఉన్నాయి. ఆ తీగల ఎత్తు పెంచేందుకు ఆర్అండ్బీ అధికారులు మా సంస్థకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మా సంస్థ వేసిన అంచనా ప్రకారం ఆర్అండ్బీ నిధులు చెల్లిస్తే వెంటనే తీగల ఎత్తు పెంచుతాం.
– వెంకటేశ్వర్లు, ఏఈ, ట్రాన్స్‌కో
బస్సు నడుపుతలేరు
మా ఊరి నుంచి చెన్నూర్‌కు ఇది వరకు బస్సు నడిచేది. రోడ్డు మంచిగ లేదని కొన్ని రోజుల కింద బంద్ చేయించిన్రు. ఇప్పుడు రోడ్డు కూడా బాగైంది. అయినా బస్సు నడుపుతలేరు. ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చినా.. మాకు లాభం లేకుంటైంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాల్లో వెళ్తున్నం. డ్రైవర్లు అడిగినంత ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఎమ్మెల్యే సారుకు ఇక్కడి నాయకులు వినతి పత్రం ఇచ్చినా ఫలితం లేదు.
– కుమ్మరి సుమతి, రొయ్యలపల్లి