పత్తి రైతులకు స్వర్ణయుగం వచ్చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వం పత్తి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తుండడంతో పలు ప్రయోజనాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. మన జిల్లాలో నల్లరేగడి నేలలు అధికంగా ఉండడం, వాతావరణం అనుకూలించడం, పత్తి నాణ్యమైనదిగా ఉండి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ రావడంతోపాటు రికార్డుస్థాయిలో ధర పలుకుతుండడం వల్ల ప్రభుత్వం పత్తి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో గుంటూరు, నంద్యాలలో మాత్రమే ఉండగా.. తెలంగాణలో మొదటిసారిగా ఆదిలాబాద్లో జిల్లాలోనే ఏర్పాటు చేస్తుండడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. – ఆదిలాబాద్, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పత్తి అధికంగా సాగవుతున్నది. యేటా వానకాలంలో 17 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతుండగా.. ఇందులో 65 శాతం పత్తి ఉంటున్నది. ప్రధానంగా అనుకూలమైన వాతావరణం, నల్లరేగడి నేలలు ఉండడం, మన పత్తి బేళ్లకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉండడంతో అధిక విస్తీర్ణంలో సాగవుతున్నది. ఈ యేడాది ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాలుకు రూ.10 వేలకుపైగా రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ఆదిలాబాద్ జిల్లాలోనే పత్తి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఉమ్మడి రాష్ట్రంలో గుంటూరు, నంద్యాలలో పరిశోధన కేంద్రాలు ఉండేవి. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుండగా.. విత్తనోత్పత్తి, అనుకూలమైన నేలలు, తెగుళ్ల నివారణ, వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన విత్తనాల ఎంపిక వంటి వాటిపై పరిశోధనలు జరగడం లేదు. వందల రకాల విత్తనాలు ఉండడంతో మేలు రకాల విషయంలో రైతులు అవస్థలు పడుతున్నారు. బీటీ విత్తనాలు వాడుతున్నా దిగుబడి సమస్య, గులాబీ రంగు పురుగు బెడదను ఎదుర్కొంటున్నారు. పత్తి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తే సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణాన్ని తట్టుకునే విత్తనాలు వస్తే దిగుబడి ఆశాజనకంగా ఉండనుంది.
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పరిశోధన కేంద్రం ఏర్పాటు వల్ల అనేక రకాల ప్రయోజనాలు చేకూరనున్నాయి. సాగులో ఎదురవుతున్న సమస్యలపై పరిశోధనలు జరిగి పరిష్కారం లభిస్తుంది. సాగులో రైతులకు శిక్షణ నిర్వహించే అవకాశాలున్నాయి. సాగులో భాగంగా వివిధ సాంకేతిక పద్ధతులు, ఆధునిక యంత్రాల వినియోగానికి అవకాశం ఉంటుంది. జిల్లాలో రైతులు సాగుచేసే పత్తికి ఆసియాలోనే గుర్తింపు ఉండగా.. నాణ్యమైన పత్తిని పండించవచ్చు. ఎగుమతులు భారీగా పెరుగుతాయి. జిల్లాలో వస్త్ర పరిశ్రమలు విస్తరించే అవకాశాలున్నాయి. దారం మిల్లులు, పత్తి నూనె గింజల మిల్లులు ఏర్పాటవుతాయి.