ఎల్లారెడ్డి, జూలై 9: ఎన్యూమరేషన్ ఫారాల (ఈఎఫ్) పంపిణీలో జిల్లాలోనే ఎల్లారెడ్డి మండలం ముందువరుసలో నిలువగా, పత్రాల స్వీకరణలో వెనుకబడిపోవడం గమనార్హం. 14 రోజుల క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమంపై గ్రామ స్థాయిలో పనిచేసే బీఎల్వోలకు ముందుగానే పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చారు. ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసినప్పటికీ, పత్రాలను సేకరించడంలో వారు పూర్తిగా విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ, సేకరణలో కొంత ఆలస్యం జరుగుతున్నది. రెవెన్యూ శాఖ అధికారుల పర్యవేక్షణతో చరుగ్గా సాగిన సర్ కార్యక్రమం.. ప్రస్తుతం లోపాల సవరణదిశగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మండల, డివిజన్ స్థాయి అధికారులకు ఈ విషయంలో కొంత మేరకు ఇబ్బందులకు కలుగుతున్నట్లు సమాచారం.
ఈఎఫ్ల సేకరణలో జాప్యం
క్షేత్ర స్థాయిలో పని చేసే వారికి ఎన్యూమరేషన్ పత్రాలు అందగానే వారికి కేటాయించిన గ్రామాలకు వెళ్లి వాటిని పంపిణీ చేయడం ప్రారంభించారు. కొన్ని గ్రామాల్లో సర్పంచుల కారణంగా పనిలో కొంత ఆలస్యం నెలకొన్నది. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో విషయం బయటికి రాగానే బీఎల్వోలు ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలను వారికి అందించారు. తర్వాత ప్రక్రియలో భాగంగా వాటిని సేకరించడంలోనూ బీఎల్వోలు ప్రతి ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ పంచాయతీ కార్యాలయం, మున్సిపాలిటీల్లో ఆయా వార్డులోని ఏదేని ఒక ప్రదేశంలో మాత్రమే ఉండడతో పత్రాల సేకరణలో కొంత జాప్యం చోటుచేసుకున్నది.
సగానికి పైగా ఓటర్లు నిరక్షరాస్యులు కావడం, చాలా మంది వృద్ధులు మాత్రమే ఇండ్లల్లో ఉండడం, వారి పిల్లలు స్థానికంగా లేక పోవడంతో ఎన్యూమరేషన్ పత్రాలను పూరించే వారే కరువయ్యారు. బీఎల్వోలు ఎక్కువగా స్థానిక సర్పంచ్ సూచనల మేరకు కేటాయించిన స్థలంలో ఉండడంతో కొందరు అక్కడికి రాలేక, వాటిని బీఎల్వోలకు అప్పగించడం లేదని తెలిసింది. ఎల్లారెడ్డి పట్టణంలోని వార్డుల్లో పని చేస్తున్న సిబ్బంది సైతం ఓటర్ల వద్దకు వెళ్లకుండా వారికి అనుకూలంగా ఉన్న ప్రదేశంలో ఉన్నారు. స్థానిక రాజకీయాలు అడ్డువచ్చి కొందరు బీఎల్వోల సేవలు పొందడం లేదని తెలుస్తోంది.
‘సర్’లో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు
ఎల్లారెడ్డి పట్టణంలో కొందరు విద్యార్థులు బీఎల్వోలకు సహకరిస్తున్నారు. పట్టణ పరిధి ఎక్కువగా ఉండడంతో రెవెన్యూ శాఖ అధికారులు స్థానిక డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ అధికారులతో మాట్లాడారు. విద్యార్థుల సేవలను ఉపయోగించుకుంటామని చెప్పడంతో కళాశాల ఎన్ఎస్ఎస్ ఇన్చార్జిలు, కళాశాల ప్రిన్సిపాల్ అంగీకరించారు. దీంతో విద్యార్థులను అవసరం ఉన్న వార్డుల్లో వలంటీర్లుగా ఉపయోగించుకుంటున్నారు. ఓటు హక్కును ఎవరూ కోల్పోకుండా వారి వివరాలను విద్యార్థులు సేకరించి ఎన్యూమరేషన్ పత్రాలను పూర్తి స్థాయిలో నింపి అధికాలకు సహకరిస్తున్నారు.