ఆదిలాబాద్, జూన్ 10(నమస్తే తెలంగాణ) ః “ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ముందుగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి.. ఆ తర్వాతనే ప్రైవేటు పాఠశాలలకు పంపవద్దని ప్రచారం చేయాలి.. అప్పుడే సర్కారు బడులపై నమ్మకం పెరుగుతుంది..” అంటూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను స్థానికుడు రాజు ప్రశ్నించాడు. ఆదిలాబాద్ జిల్లా యాపల్గూడలో ఓ ఉపాధ్యాయ సంఘం యాత్ర చేపట్టగా రాజు ప్రశ్నించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఇంటర్, డిగ్రీ చదువుకుని ఉంటారు. వారే మంచిగా బోధిస్తున్నప్పుడు అన్ని అర్హతలు ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎందు కు చెప్పడం లేదని నిలదీశాడు. ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించాలని ప్రచారం చేయడం పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం లేదనడమే అని అన్నాడు.
ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు ఎందుకు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారని, తమ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు చదువాలని ప్రశ్నించాడు. ప్రభుత్వ పాఠశాలలపై ఉపాధ్యాయులకు ఎందుకు నమ్మకం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఉండాలి. కానీ ప్రభుత్వ పాఠశాలల చదువులు ఎందుకు పనికిరావని ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాజు చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని ఆలోచింప జేస్తున్నాయి.