రెబ్బెన, నవంబర్ 30 : బెల్లంపల్లి ఏరియాలోని ప్రైవేట్ కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరారు. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి జీఎం కార్యాలయంలో ఏరియా జీఎం శ్రీనివాస్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించారు. సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ఆర్అండ్ఆర్ కాలనీల్లో సౌకర్యాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏరియా ఎస్వోటూ జీఎం రాజమల్లు, ఏరియా సెక్యూరిటీ అధికారి ఉమాకాంత్, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, మేనేజర్ మహేశ్ ఉన్నారు.
ఓసీపీని త్వరగా ప్రారంభించాలి
బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఓపెన్ కాస్ట్‌ను త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరారు. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి జీఎం కార్యాలయంలో ఏరియా జీఎం శ్రీనివాస్‌తో సమావేశమయ్యారు. ఓసీపీకి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. అటవీ అనుమతులు రాకపోవడంతో ఓపెన్‌కాస్ట్ ప్రారంభం ఆలస్యమవుతుందని సింగరేణి జీఎం తన దృష్టికి తీసుకొచ్చారని, త్వరలో అటవీ అధికారులతో కూడా చర్చిస్తానని, అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ అంశంపై మాట్లాడుతానని కోవ లక్ష్మి పేర్కొన్నారు. ఏరియాలోని గోలేటి, ఎంవీకే ఓసీపీలు ప్రారంభమైతే కార్మికుల సంఖ్య పెరగడంతో పాటు స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, ఏరియా కార్యదర్శి మారిన వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ అజ్మీరా బాబురావు, మాజీ సర్పంచ్ పొటు సుమలత, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పొటు శ్రీధర్‌రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, పందిర్ల మధునయ్య ఉన్నారు.