మంచిర్యాల, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే కార్మికుల కష్టాన్ని నస్పూర్ మున్సిపాలిటీ వాడుకుంటున్నది. న్యాయంగా వారికి ఇవ్వాల్సిన ఈపీఎఫ్, ఈఎస్ఐ చెల్లించకుండా తాత్సారం చేస్తున్నది. జిల్లాలో ఏ మున్సిపాలిటీలో లేనంతగా ఇక్కడి కార్మికులు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. బల్దియాలో పని చేసే 130 మంది కాంట్రాక్టు, 86 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఐదు నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబాన్ని నెట్టుకురావడం కోసం అప్పుల పాలు కావాల్సిన దుస్థితి నెలకొంది.
దసరా పండుగ సమయంలో వేతనాలు రాక పస్తులుండాల్సి వస్తుందంటూ కార్మికలోకం వాపోతున్నది. కాగా, ఇదే మున్సిపాలిటీలో మరో 20 నుంచి 25 మంది ఎలాంటి మున్సిపల్ తీర్మానం లేకుండా, అటెండెన్స్ లేకుండా, వేతనాలు తీసుకోకుండా 10 నెలలుగా పనిచేస్తున్నట్లు తెలిసింది. పైగా వాళ్లను తాము పనిలో పెట్టుకోలేదని, అంతకుముందున్న అధికారులు ఎలా పెట్టుకున్నారో తమకు తెలియదంటూ ప్రస్తుతమున్న సిబ్బంది దాటవేసే ధోరణితో వ్యవహరిస్తున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కార్మికుల శ్రమను 10 నెలలుగా దోచుకుంటున్నారు.
రూ.1.61 కోట్ల ఈపీఎఫ్ సొమ్ము వాడుకున్న మున్సిపాలిటీ..
నస్పూర్.. 2018 ఆగస్టులో మున్సిపాలిటీగా ఏర్పడింది. అప్పటి నుంచి జూలై 2021 వరకు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే ఉద్యోగులకు అసలు ఈఫీఎఫ్ చెల్లించలేదు. ఓ ఫిర్యాదు వెల్లడంతో ఆ ఏడాది ఆగస్టు నుంచి నవంబర్ వరకు నాలుగు నెలల పాటు ఫీఎఫ్ చెల్లించారు. అనంతరం డిసెంబర్ 2021 నుంచి ఇప్పటి వరకు పీఎఫ్ చెల్లించనే లేదు. కానీ 2018 నుంచి కార్మికుల జీతంలో పీఎఫ్ షేర్ 12శాతం మున్సిపాలిటీ కట్ చేస్తున్నది.
కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులకు రూ.17000 జీతం ఉంది. సీలింగ్ లిమిట్ రూ.15 వేలు తీసుకుంటే.. ఇందులో 12 శాతం అంటే ప్రతి నెలా రూ.1800 అవుతుంది. ఈ లెక్కన ఇప్పుడున్న 130 మంది కార్మికులకు నెలకు రూ.2.34 లక్షలు అవుతుంది. నస్పూర్ మున్సిపాలిటీగా ఏర్పడి 2024 అక్టోబర్ నెలకు 73 నెలలు అవుతుంది. ఇందులో నాలుగు నెలలు ఈపీఎఫ్ చెల్లించారు. అవి మినహాయిస్తే 69 నెలల ఈపీఎఫ్ మున్సిపాలిటీ జమ చేయలేదు.
ఈ 69 నెలలకు ప్రతి నెలా కార్మికులకు ఇవ్వాల్సిన రూ.2.34 లక్షల చొప్పున లెక్కవేస్తే రూ.1.61 కోట్లు అవుతుంది. కార్మికుల జీతం నుంచి కట్ చేసుకున్న ఈ మొత్తం ఈపీఎఫ్ చెల్లించకుండా నస్పూర్ మున్సిపాలిటీనే వాడుకుంది. వాస్తవానికి కార్మికుల జీతం నుంచి కట్ చేస్తే 12 శాతానికి అంతే మొత్తం కలిపి మున్సిపాలిటీ ఈపీఎఫ్ చెల్లించాలి. కానీ ఇక్కడ అలాంటిది చేయకుండా ఉల్టా కార్మికుల సొమ్మునే వాడుకోవడం విమర్శలకు తావిస్తున్నది.
ఈఎస్ఐ కట్టకుండా.. కార్మికుల ప్రాణాలతో చలగాటం..
మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే ఈ 130 మంది కాకుండా మరో 86 మంది ఔట్సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నారు. కానీ ఈ 86 మందికి గత రెండేళ్లుగా ఈపీఎఫ్, ఈఎస్ఐ చెల్లించడం లేదు. రూ.12000 జీతం మాత్రమే ఇస్తున్నారు. నిబంధనల ప్రకారం రూ.20వేల లోపు జీతం ఉంటే ఈఎస్ఐ కట్టాలి. కానీ 2018 నుంచి మున్సిపాలిటీ ఎవరికీ ఈఎస్ఐ చెల్లించలేదు. 2021 నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులు 130 మందికి దీన్ని వర్తింప చేస్తున్నారు.
వీరిలో 15 మంది జీతాలు రూ. 20 వేలకు మించి ఉండడంతో 115 మందికి ప్రతి నెలా రూ.120 చొప్పున ఈఎస్ఐ కడుతున్నారు. కాకపోతే అది కూడా రెగ్యులర్‌గా కట్టడం లేదని తెలిసింది. దీంతో సీనియారిటీ కొల్పోయి కార్మికులు సూపర్ స్పెషాలిటీ, ఇతర ముఖ్యమైన వైద్యసేవలకు దూరం అవుతున్నారు. సక్రమంగా లేని పేమెంట్స్‌తో ఎమర్జెన్సీ వైద్యం కోసం వెళ్లిన కార్మికులకు నిరాశే ఎదురవుతున్నది. ఇటీవల శేఖర్ అనే ఔట్సోర్సింగ్ ఉద్యోగి జ్వరంతో బాధపడుతూ కొన్ని రోజుల పాటు విధులకు హాజరయ్యాడు. ప్రైవేట్ వైద్యం చేయించుకునే స్థోమతలేక ఈఎస్ఐ అప్లికేబుల్ ఉన్న ఓ దవాఖానలో వైద్యం చేయించుకున్నాడు. జ్వరం తీవ్రత పెరగడంతో హైదరాబాద్‌లోని ఈఎస్ఐ హాస్పిటల్‌కు తీసుకువెళ్లే క్రమంలో మార్గంమధ్యలోనే మృతి చెందాడు.
అదే ఈఎస్ఐ సమయానికి కట్టి ఉంటే నేరుగా హైదరాబాద్‌కు వెళ్లి చూపించుకునే వారమని, మున్సిపాలిటీ నుంచి కట్టకపోవడంతో మంచిర్యాలలోనే చూపించుకోవాల్సి వచ్చిందని.. కార్మికుడిని మున్సిపాలిటీనే బలితీసుకుందని వారి కుటుంబసభ్యులు, కార్మికులు ఆరోపిస్తున్నారు. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నా రు. ప్రతి నెలా 115 మంది నుంచి రూ.13,800 ఈఎస్ఐ కట్ చేస్తున్న మున్సిపాలిటీ, వాటిని జమ చేయడంతో మాత్రం జాప్యం చేస్తున్నట్లు తెలిసింది. ఇకపోతే మరో 20 నుంచి 25 మంది ఉద్యోగులు ఎలాంటి తీర్మానం లేకుండా మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు. వీరి నుంచి అంటెండెన్స్ సైతం అధికారులు తీసుకోవడం లేదు.
ఓ ఉద్యోగి గత శనివారం చెత్తసేకరణ వాహనాన్ని డంప్‌యార్డు దగ్గర అన్లోడ్ చేస్తూ.. రివర్స్ తీసుకునే క్రమంలో కంట్రోల్ తప్పి వాహనాన్ని బోల్తా కొట్టించాడు. అదృష్టవశాత్తు చిన్న దెబ్బలతో తప్పించుకున్నాడు. అదే ఏమైనా జరిగి ఉంటే పరిస్థితి ఏమిటి.. మున్సిపాలిటీ మాకు సంబంధం లేదని చెప్తే ఆ కుటుంబం ఏమైపోయేది అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. కార్మికుల జీవితాలతో చలగాటం ఆడకుండా, ఇప్పటికైనా ఈఎస్ఐ, ఈపీఎఫ్‌లు సకమ్రంగా చెల్లించాలని కోరుతున్నారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ సతీశ్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్లో అందుబాటులోకి రాలేదు. మరి ఈ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది వేచి చూడాల్సి ఉంది.
కోట్లాది రూపాయాలు పెండింగ్
నస్పూర్ బల్దియాకు జిల్లాలో ఏ మున్సిపాలిటీకి లే నంత ఆదాయ వనరులున్నాయి. ఒక్క సింగరేణి సం స్థ నుంచే రూ.2.5 కోట్ల పన్నులు పెండింగ్‌లో ఉన్నా యి. అంతేగాకుండా శ్రీరాంపూర్ ఓసీపీలో ఉన్నటువంటి మూడు ప్రైవేట్ కంపనీల నుంచి దాదాపు రూ.70 లక్షల వరకు పన్నులు రావాల్సి ఉంది. వీటిని వసూలు చేస్తే కార్మికులకు పెండిగ్ వేతనాలు ఇవ్వడంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ కట్టడం పెద్ద సమస్య కాదు. కానీ పన్నుల వసూళ్లలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సామాన్యుల వద్ద ముక్కు పిండి పన్నులు వసూలు చేసే అధికారులు.. మరి బకాయిలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదో అర్థం కావడం లేదు.
వేతనాలివ్వలేని స్థితిలో ఉండడం సిగ్గుచేటు
మున్సిపాలిటీ కార్మికులకు వేతనాలు, ఈపీఎప్, ఈఎస్ఐ ఇవ్వలేని స్థితిలో మున్సిపాలిటీ ఉండడం నిజంగా సిగ్గుచేటు. పన్నుల వసూళ్ల పేరిట సామాన్యులపై ఉక్కుపాదం మోపే మున్సిపాలిటీ అధికారులు కోట్లలో బాకాయిలుంటే ఎందుకు స్పందించడం లేదో చెప్పాలి. వెంటనే కార్మికులకు వేతనాలు చెల్లించాలి.
– నయీం, సామాజిక కార్యకర్త