కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ సోమవారం ఉద్యోగులు, కార్మికుల ధర్నాలతో హోరెత్తింది. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, ఆశ్రమాల్లోని కార్మికులు వందలాదిగా తరలివచ్చి కలెక్టరేట్ వద్ద ఆందోళనలు చేపట్టారు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అసంఘటిత కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఐటీయూ నాయకులు విమర్శించారు. ధర్నాల నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
కార్మికులను కలెక్టరేట్లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో కార్మికులు కలెక్టరేట్ గేటు పక్కన టెంట్లు వేసుకొని ధర్నాకు దిగి నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆశ కార్యకర్తలు మాట్లాడుతూ రూ.18 వేల వేతనం చెల్లించాలని, ఉద్యోగోన్నతులు, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న కార్మికులు మాట్లాడుతూ 64 జీవోతో నష్టపోతున్నామని, పాత జీవో ప్రకారం వేతనాలివ్వాలన్నారు. కొత్త మెనూతో పని భారం పెరిగిందని, కార్మికుల సంఖ్య పెంచాలని, ఉద్యోగ భద్రత, తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్మికుల కనీసం వేతనాన్ని పెంచాలని అర్హులైన వారిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బ్రహ్మచారి, టేకం ప్రభాకర్, బిందు, దుర్గం దినకర్, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.