భీంపూర్, ఫిబ్రవరి24 : అందరూ ఉన్నా చివరి దశలో అనాథలా మిగిలిందో వృద్ధురాలు. స్థానికుల సమాచారంతో సెడ్స్ సంస్థ ఆమెను ఆశ్రమానికి చేర్చింది. వివరాలిలా ఉన్నాయి. తలమడుగు మండలం ఖోడద్ గ్రామానికి చెందిన రామెల్లి రాజక్కకు 70 ఏళ్లు. కొన్నేళ్ల క్రితం కొడుకు ఇంటినుంచి భీంపూర్ మండలం అంతర్గాంలో ఉంటు న్న కూతురు, అల్లుడి ఇంటికి వచ్చి ఉంటున్నది. కూతురు అల్లుడిది కూడా కూలీలు కావడంతో వృద్ధురాలి పోషణ భారంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితి తెలిసిన మాజీ సర్పంచ్ గుండా ప్రకాశ్, సవాయి స్వామి సెడ్స్ వారికి సమాచారం ఇచ్చారు. సెడ్స్ ప్రతినిధి భాస్కర్ అంతర్గాంకు వచ్చి వృద్ధురాలిని ఆదిలాబాద్‌లోని కేఆర్కే కాలనీలోని ఆశ్రమానికి తరలించారు.
నిర్మల్ చైన్‌గేట్, ఫిబ్రవరి 24: నిరాశ్రయురాలైన ఓ వృద్ధురాలిని ఐసీడీఎస్ అధికారులు గురువారం ఆశ్రమంలో చేర్చారు. వివరాలిలా ఉన్నా యి. కుంటాల మండలం సూర్యాపూర్‌కు చెందిన ఆరె శాంత (86) నిర్మల్‌లో అద్దెకు ఉంటున్నది. ఇంటి యజమాని ఆమెను బయటకు పంపివేయడంతో సునార్గల్లీలోని అంగన్వాడీ కేంద్రం వద్ద కు రాగా, అంగన్వాడీ టీచర్ సూర్యకళ ఆశ్రయం ఇచ్చారు. అనంతరం ఆమె పరిస్థితిని సీడీపీవో నాగమణి దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు వచ్చి సాగర్ కాలనీలోని వృద్ధాశ్రమంలో చేర్పించారు. కార్యక్రమంలో ఏసీడీపీవో నాగలక్ష్మి, బాలల పరిరక్షణ అధికారి సగ్గం రాజు పాల్గొన్నారు.