నమస్తే బృందం : మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో సోమవారం ఈద్-ఉల్-ఫితర్‌ను ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేయగా, ఆదివారం సాయంత్రం ముగిశాయి. సోమవారం ఉదయమే ఈద్గాలు, మసీదుల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకొని సామూహిక ప్రార్థనలు చేశారు. మత పెద్దల సందేశాలను శ్రద్ధగా విన్నారు. మంచిర్యాల పట్టణంలోని క్వారీ, బస్టాండ్ ఈద్గాల వద్ద జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు పాల్గొన్నారు.
బస్టాండ్ ఎదురుగా ఉన్న ఈద్గా వద్ద, ఆండాలమ్మ కాలనీలోని మసీదు వద్ద నిర్వహించిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజిత్‌రావు, చెన్నూర్, మందమర్రిలో ఎమ్మెల్యే గడ్డం వివేక్ పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల ఇండ్లకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి, డీసీసీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సకు వెళ్లి విందు స్వీకరించారు.