తాండూర్ : సత్వర వ్యాధి నిర్ధారణ వల్ల రోగి ప్రాణాలను కాపాడటంతో పాటు వ్యాప్తిని క్షయవ్యాధిని ( Tuberculosis ) నియంత్రించగలమని మంచిర్యాల జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ ( Dr. Sudhakar Naik) అన్నారు. గురువారం తాండూర్ పీహెచ్సీ ఆధ్వర్యంలో కిష్టంపేట రైతువేదిక ఆవరణలో వైద్య శిబిరం ( Medical Camp ) నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులు, ప్రజలతో ఆయన మాట్లాడారు.
రెండు వారాలకు పైగా దగ్గు లక్షణాలు ఉంటే క్షయ వ్యాధిగా అనుమానించాలన్నారు. జిల్లాలోని ప్రతి ఆరోగ్య కేంద్రంలో వ్యాధి నిర్ధారణ తెమడ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారన్నారు. క్షయ వ్యాధి నిర్ధారణ జరిగితే ఉచితంగా చికిత్స అందిస్తూ, చికిత్స పూర్తయ్యే వరకు ప్రతినెల వేయి రూపాయల చొప్పున పోషణ భత్యాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ఈ వ్యాధి తొందరగా వ్యాపిస్తుందని, అందుకు అన్ని రకాల పోషకాహారాలు దొరికే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమ మార్గమమన అన్నారు.
తుంపర్ల ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే ఈ వ్యాధి, మద్యం సేవించే వారికి , పొగాకు నమిలే వారికి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ శిబిరంలో 134 మందికి అన్ని రకాల పరీక్షలు చేశారు. శిబిరంలో బీపీ, షుగర్, హెచ్ఐవీ, హెపటైటిస్, టీబీ పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్లు ఝాన్సీ, లక్ష్మిప్రసన్న, శిరీష, గ్రామపంచాయతీ సెక్రటరీ ఉదయ్, అసుపత్రి సిబ్బంది, ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.