కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియోజకవర్గాలవారీగా అభ్యర్థులు ప్రకటించడంతో, వారంతా ప్రచార క్షేత్రంలో అడుగుపెట్టారు. నిత్యం కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ అభ్యర్థి కోవ లక్ష్మి, సిర్పూర్ అభ్యర్థి కోనేరు కోనప్ప నిరంతరం కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ గ్రామాల బాట పట్టారు. ఈ క్రమంలో వారికి ఆయా వర్గాల నుంచి భారీ మద్దతు లభిస్తుండగా, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీల నుంచి చేరికలు పెరిగాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఖరారు కావడంతో నాయకులు, కార్యకర్తలు కోవ లక్ష్మి, కోనేరు కోనప్పను కలిసేందుకు వస్తున్నారు. నిత్యం వందలాది మంది కార్యకర్త లు, పార్టీ శ్రేణులు తరలి వస్తుండడంతో అభ్యర్థుల నివాసాలు సందడిగా మారాయి. ఇదే సమయంలో అభ్యర్థులు కూడా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆసిఫాబాద్ అభ్యర్థి కోవ లక్ష్మి సోమవారం జైనూర్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యర్తలు, నాయకులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. జైనూర్ మండల పొలిమేర నుంచే ఆమెకు ఘన స్వాగతం పలికారు. వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నిండింది. సిర్పూర్ నియోజకవర్గం అభ్యర్థి కోనప్ప కౌటాల, కాగజ్నగర్ మండలాల్లో ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో ఇతరపార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ముందుగానే ప్రకటించడంతో ప్రతిపక్ష పార్టీలు నైరాశ్యంలోకి వెళ్లాయి. ఆయా పార్టీల్లో టికెట్ ఎవరికి వస్తుందో, అభ్యర్థి ఎవరో తెలియక అయోమయానికి గురవుతున్నారు. తమ పార్టీల్లో పరిస్థితి బాగాలేదని, ఇక లాభం లేదనుకొని బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. దీంతో చేరికలు పెరగడంతో అధికార పార్టీలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తున్నది. దీంతో ప్రతిపక్ష పార్టీల మనుగడ ప్రశ్నార్థకమైంది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేపథ్యంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరడంతోపాటు ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీంతో సహజంగానే ప్రజలు బీఆర్ఎస్కు జై కొడుతుండగా, ప్రతిపక్ష పార్టీల్లో ఆ జోష్ కనిపించడం లేదు.
ఇక గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు రోజురోజకూ ఆదరణ పెరుగుతున్నది. కోవ లక్ష్మి, కోనేరు కోనప్పలకు కార్యర్తల ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ఇక అభ్యర్థుల నివాసాలకు కూడా శ్రేణుల తాకిడి పెరిగింది. పార్టీ కార్యర్తలు అభ్యర్థులను తమ గ్రామాలకు రావాలంటూ ఆహ్వానిస్తున్నారు. ఆయా చోట్ల వారికి అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. మీవెంటే మేమున్నామని, గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం మరింతగా పెరుగుతున్నది.