బెల్లంపల్లి, జనవరి 6 : ఖాజీపేట నుంచి బల్హార్ష వరకు మూడో రైల్వేలైన్ ట్రాక్ పనుల్లో భాగంగా పలు రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్-కాగజ్నగర్, ఖాజీపేట్-కాగజ్నగర్, కొత్తగూడెం-బల్హార్ష నడుమ నడిచే రైళ్లను రద్దు చేశారు. కేవలం ఇంటర్సిటీ రైలు మాత్రమే నడుస్తోంది. జమ్మికుంటలోని బిజిగిరి షరీఫ్ రైల్వే ట్రాక్ వద్ద మూడో రైల్వే లైన్ పనులు చేపడుతుండగా, కొన్ని రోజులుగా రామగిరి, సింగరేణి, పుష్పుల్ రైళ్లను రద్దు చేశారు.
తాజాగా.. ఈ నెల 3 నుంచి కాగజ్నగర్, భాగ్యనగర్ రైళ్లను సైతం రద్దు చేయడంతో రాకపోకలకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. అనేక మంది బెల్లంపల్లి నుంచి కాగజ్నగర్ ఎక్స్ప్రెస్, భాగ్యనగర్ రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. ఇక వ్యా పారులతో పాటు పలువురు ఉద్యోగులు సికింద్రాబాద్కు రాకపోకలు సాగిస్తుంటారు.
ఈ రెండు రైళ్లను మాత్రం ఈ నెల 13వ తేదీ తర్వాత పున:రుద్ధరించనున్నట్లు బెల్లంపల్లి రైల్వే అధికారులు తెలిపారు. పండుగ ముందు రైళ్లు నడవకపోవడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నిత్యం రద్దీగా ఉండే బెల్లంపల్లి రైల్వేస్టేషన్ నిర్మానుష్యంగా మారింది. ఒకటి, రెండవ ప్లాటుఫాంలు వెలవెలబోతున్నాయి. టికెట్ కౌంటర్ ఖాళీగా దర్శనమిస్తోంది. ఆటోలకు గిరాకీ లేకుండా పోయింది. రైళ్ల రద్దుతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసి పోతున్నాయి.