మంచిర్యాల, జనవరి 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సంక్రాంతి పండుగ పూట రేషన్ దుకాణాలకు బియ్యం రాకపోవడంతో ప్రజలకు సరఫరా ఆలస్యం అవుతున్నది. పిండి వంటలకు బియ్యం అవసరం కావడంతో రేషన్‌కార్డుదారులు చౌక ధరల దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. సాధారణంగా ప్రతినెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ బియ్యం లబ్ధిదారులకు అందించాలి. ఇందుకోసం ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి ముందుగానే బియ్యం రేషన్ షాపుల్లోకి చేరుకోవాలి. డిసెంబర్ 31వ తేదీలోగా రావాల్సిన బియ్యం పది రోజులు గడుస్తున్నా రాలేదు. ఉమ్మడి జిల్లాలో సగం రేషన్ షాపులకు మాత్రమే బియ్యం వచ్చాయి.
మిగిలిన వాటికి రాలేదు. బియ్యం కోసం అధికారులను అడిగినా, ఎంఎల్ఎస్ పాయింట్‌కు వెళ్లినా.. ప్రయోజనం లేదని రేషన్ డీలర్లు వాపోతున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రస్తుతం పంపిణీ ప్రక్రియ నడుస్తున్నది. మొన్నటి వరకు రేషన్ బియ్యం అందలేదు. ఇప్పుడు అన్ని షాపులకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. మంచిర్యాల జిల్లాలో సగం రేషన్ దుకాణాలకు మాత్రమే బియ్యం చేరాయి. పదో తేదీ ముగిసినప్పటికీ రేషన్ రాకపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు. సంకాంత్రి పండుగకు పిండి వంటలు చేసుకునేందుకు బియ్యం కోసమని వెళ్తే లేవని చెప్తుండడంతో ఏం చేయలేక ఖాళీ చేతులతో వెనుదిరుగుతున్నారు.
ప్రభుత్వం రేషన్ దుకాణాలకు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి పంపించాల్సిన రేషన్ బియ్యం మూమెంట్ ఆలస్యమైంది. ఎంఎల్ఎస్ పాయింట్లలో బియ్యం సకాలంలో రాలేదని, అందుకే రేషన్ దుకాణాలకు అందలేదని తెలుస్తున్నది. ఈ నెలకు సంబంధించిన బియ్యం రిలీజింగ్ ఆర్డర్(ఆర్వో) కూడా లేట్ అయ్యింది. జనవరి నెలకు సంబంధించిన ఆర్వో డిసెంబర్ 20వ తేదీలోపు రావాల్సి ఉండగా, నెలాఖరున రిలీజింగ్ ఇవ్వడంతో మూమెంట్ ప్రక్రియ వెనుకబడింది. మరోవైపు లారీల యాజమాన్యాలు సమ్మెలో ఉండడం కూడా బియ్యం రవాణాపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నది.
బియ్యం సరఫరా చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నప్పటికీ లారీల కొరత వేధిస్తున్నది. మంచిర్యాల జిల్లాలో 423 రేషన్ దుకాణాలున్నాయి. వీటిలో 240 దుకాణాలకు సరఫరా పూర్తయ్యింది. మంచిర్యాలలోని ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో 142 రేషన్ దుకాణాలు ఉండగా 65 రేషన్ షాపులకు, తాండూర్‌లో 42 దుకాణాలకు 28, లక్షెట్టిపేట 81 దుకాణాలకు 32, బెల్లంపల్లిలో 72 దుకాణాలకు 57, చెన్నూర్‌లో 52 దుకాణాలకు 35, కోటపల్లిలో 34 దుకాణాలకు 23 షాపులకు పూర్తి స్థాయిలో బియ్యం సరఫరా అయ్యాయి.
మా ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో 142 రేషన్ దుకాణాలు ఉన్నాయి.ఈ రోజు వరకు 65 దుకాణాలకు బియ్యం సరఫరా చేయడం పూర్తయ్యింది. ఈ రోజు రెండు లారీలు వస్తే రెండింటినీ లోడ్ చేసి పంపాం. లారీలు వచ్చినకొద్ది ఏ డీలర్ వస్తే వారికి బియ్యం లోడ్ చేసి పంపిస్తున్నాం. ఈ నెల మొదటి నుంచి మూమెంట్ ఆలస్యమైంది. రేషన్ బియ్యం మాత్రం కొంత ఆలస్యమైంది. – శంకర్, ఎంఎల్ఎస్ పాయింట్
ఇన్చార్జి, మంచిర్యాల.
మందమర్రి, జనవరి 10: సంక్రాంతి పండుగ దగ్గర పడుతున్నా రేషన్ బియ్యం పోస్తలేరు. ఎన్నిసార్లు డీలర్‌ను అడిగినా ఇంకా బియ్యం రాలేదనే చెబుతున్నడు. గతంలో ప్రతి నెలా మొదటి వారంలోనే బియ్యం వచ్చేది. ఈ నెల సంక్రాంతి పండుగ ఉన్నా వారం దాటినా బియ్యం రాలేదు. గత సర్కారు ఎప్పుడు పండుగొచ్చినా ముందుగానే రేషన్ దుకాణాల్లో సరుకులను అందజేసేది. కొత్తగా ఏర్పడిన సర్కారు బియ్యం సరఫరాను పట్టించుకుంటలేదు. అధికారులు జోక్యం చేసుకొని బియ్యం సరఫరా చేయాలి. -కాంపెల్లి ఎర్రక్క,మందమర్రి
మందమర్రి, జనవరి 10: ఏదో మార్పు వస్తుందని ఓటు వేసి గెలిపిస్తే కొత్త సర్కారు హయాంలో వచ్చిన మార్పు ఇదేనా. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న రేషన్ బియ్యం రాలేదు. రోజూ రేషన్ దుకాణానికి వెళ్లి నిరాశతో తిరిగి వస్తున్నం. రేషన్ డీలర్ ఇంకా బియ్యం రాలేదనే సమాధానం తప్ప ఎప్పుడస్తయో చెప్పడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం మొదటి వారంలోనే బియ్యం ఇచ్చేది. ఎవరిని అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం నెల రోజుల్లోనే ఇబ్బందులకు గురి చేస్తోంది. అధికారులు పండుగ లోపు రేషన్ బియ్యం వచ్చే విధంగా చూడాలి. -సీపెల్లి గున్నమ్మ ,మందమర్రి.