నిర్మల్, మే 29(నమస్తే తెలంగాణ) : కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఉచితంగా చేపపిల్లల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. దాదాపు ఎనిమిదేండ్లపాటు యేటా వానకాలం ప్రారంభానికి ముందే చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లలను వదలడానికి ప్రణాళికలు రూపొందించే వారు. మే నెల చివరి నాటికి టెండరు ప్రక్రియ కూడా పూర్తి చేసి.. జూన్, జూలై మాసాల్లో చెరువుల్లోకి కొత్తనీరు చేరగానే వదిలేవారు. కాగా.. ఈ యేడు చేపపిల్లల పథకం అమలుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా పంపిణీపై మాట కూడా లేదు. దీంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకపోవడంతో అధికారులు కార్యాచరణ రూపొందించలేదు.
ఈసారి చేపపిల్లల పంపిణీ ఉంటుందా? ఉండదా? అన్న అయోమయంలో మత్స్యకారులు ఉన్నారు. నిర్మల్ జిల్లాలో 214 మత్స్యకార సంఘాలు ఉండగా 13,300 మంది సభ్యులు ఉన్నారు. 19 మండలాల పరిధిలో 644 చెరువులు ఉన్నాయి. వీటితోపాటు ఎస్సారెస్పీ, కడెం, స్వర్ణ, గడ్డెన్న వాగు ప్రాజెక్టులు ఉన్నాయి. ఆయా రిజర్వాయర్లు, చెరువుల్లో గతేడాది వర్షాకాలంలో 4.75 కోట్ల ఉచిత చేప పిల్లలను విడుదల చేయాలని మత్స్యశాఖ అధికారులు ప్రతిపాదించారు. వీటికి అప్పటి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఆ మేరకు చేప పిల్లలను సరఫరా చేసే కాంట్రాక్టర్ల కోసం మే నెలలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి జూలై, ఆగస్టు మాసాల్లో చేప పిల్లలను చెరువులు, రిజర్వాయర్లలో విడుదల చేసింది. కాగా.. పెంచిన చేపలను మార్కెట్కు తరలించి విక్రయించేందుకు వాహనాలు, వలలను సబ్సిడీపై అందజేసి కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారులకు అండగా నిలిచింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు చేప పిల్లల పంపిణీపై ఊసెత్తక పోవడంతో మత్స్యకారులు మండిపడుతున్నారు. అయితే ఈ విషయమై జిల్లా అధికారులను సంప్రదించగా.. పార్లమెంటు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున జూన్ 4 తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే టెండర్ ప్రక్రియను పూర్తి చేయకపోతే ఈ సంవత్సరం ఉచిత చేపపిల్లల పంపిణీ ఉండదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మత్స్యకారుల సమస్యలను ఈ కాంగ్రెస్ ప్రభు త్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. వర్షాకాలం ప్రారంభమవు తున్నా.. ఇంతవర కు చేప పిల్లల కోసం టెండర్లు పిలువ లేదు. మత్స్యకార శాఖకు ఇంతవరకు మంత్రి కూడా లేడు. తమకు రావాల్సిన సబ్సిడీలు, ఇతర బెనిఫిట్స్ ఏవీ కూడా రావడం లేదు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా గంగ పుత్రులను ఇంతగా నిర్లక్ష్యం చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో చేపల సీడ్ కోసం మార్చి నెల నుండే టెండర్లను పిలిచి మే నెలాఖరు వరకు పూర్తి చేసేవారు. జూన్ నుంచి ఆగస్టు లోపు సీడ్ కూడా పంపిణీ జరిగి చెరువుల్లో వదిలేవారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చేపపిల్లల పంపిణీకి చర్యలు తీసుకోవాలి.
– జింక సూరి, మత్స్యకార సంఘం నాయకుడు, నిర్మల్.