ఎదులాపురం,మే9: రెండు పడక గదుల ఇళ్ల పంపిణీకి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపునకు జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నదన్నారు. ఇళ్లులేని నిరుపేదలకు అందించేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పట్టణ పరిధిలోని 32 వార్డుల నుంచి 2538 మంది అర్హులు ఉండగా, లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులకు ఎంపిక చేసినట్లు చెప్పారు.
ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వేషన్ ప్రకారం దివ్యాంగుల కేటగిరిలో 242 మందికి గాను 32 మందికి, ఎస్సీల్లో 256 మందికిగాను 115 మందికి, ఎస్టీల్లో 148 మందికి గాను 38 మందికి, మైనార్టీ కేటగిరిలో 1079 మందికి గాను 81 మందికి, జనరల్ కేటగిరిలో 352 మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశామని వెల్లడించారు. మొత్తం 618 మందికి రెండు పడక గదుల ఇళ్లను కేటాయించినట్లు చెప్పారు. ఎలాంటి అపోహలకు తావులేకుండా ఈ ఎంపిక ప్రక్రియను ఫొటోలు, వీడియో చిత్రీకరణ చేశామని వివరించారు.
రెండు పడక గదుల ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను రాష్ట్ర ఐటీ శాఖకు పంపించినట్లు తెలిపారు. వారు రూపొందించిన జాబితా నుంచి లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశామని వివరించారు. ఎంపికపై ఏమైనా అభ్యంతరాలుంటే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లో లేదా తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎంపిక ప్రక్రి యకు సహకరించిన లబ్ధిదారులు, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ట్రైనీ సహాయ కలెక్టర్ పీ శ్రీజ, ఆర్డీవో రమేశ్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ శైలజ, తహసీల్దార్ సతీశ్, కౌన్సిలర్లు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.