తాంసి(భీంపూర్), నవంబర్ 24 : గ్రామ దేవతలు పాడి పంటలు, సుఖశాంతులు ఇస్తాయని, వారిని మరవద్దని ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం భీంపూర్ మండల శివారులో గల బద్ది పోచమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలోని పోచమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అనంతరం నిపాని గ్రామాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ నాగయ్య, మాజీ జడ్పీటీసీ సుధాకర్, నాయకులు జహుర్ అహ్మద్, మడావి లింబాజీ, సంజీవ్‌రెడ్డి, రవికాంత్, రాజన్న, గంగయ్య, సంతోష్, అఫ్రోజ్ పాల్గొన్నారు.
బజార్హత్నూర్, నవంబర్ 24 : ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది స్థానికంగా ఉంటూ.. నిత్యం అందుబాటులో ఉండాలని అసిస్టెంట్ (ట్రెయినీ) కలెక్టర్ ఆభిజ్ఞాన్ మాలావ్య సూచించారు. ఆదివారం బజార్హత్నూర్, జాతర్ల, మాడగూడ గ్రామాల్లోని ఆశ్రమ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లోని నిల్వ ఉన్న సరుకులను పరిశీలించి స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులకు అందించే భోజనంపై ఆరా తీశారు. మోనూ ప్రకారం నిత్యం భోజనం అందుతుందో లేదో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నిత్యం విద్యార్థులకు అందుబాటులో ఉంటూ.. రాత్రి వేళల్లో విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కృష్ణారావు పాల్గొన్నారు.
నేరడిగొండ, నవంబర్ 24 : పదో తరగతిలో మంచి మార్కులు సాధించేలా కష్టపడి చదవాలని అసిస్టెంట్ కలెక్టర్ అభినవ్ అభిజ్ఞ గిరిజన విద్యార్థులకు సూచించారు. ఆదివారం మండలంలోని కుంటాల బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలన్నారు. ఆయన వెంట పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.