పెంబి, జూన్ 21 : ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను ఖానాపూర్‌లో కాకుండా ఎమ్మెల్యే చొరవతో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో నిర్మించడంపై పెంబి మండలంలోని అఖిలపక్షం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ప్లకార్డులు పట్టుకుని రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను ఉట్నూర్‌లో నిర్మిస్తే ఖానాపూర్, పెంబి, కడెం, దస్తురాబాద్ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఖానాపూర్ పట్టణంలోని కుమ్రం భీం చౌరస్తా వద్ద అనుకూలమైన స్థలం ఉన్నప్పటికీ స్థలం సాకుతో స్కూలును తరలించడంపై మండిపడ్డారు. రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో ఎస్ఐ హన్మండ్లు ధర్నాను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సల్లా నరేందర్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గంగారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్, నాయకులు భూక్య గోవింద్, మహేందర్, గాండ్ల శంకర్, సరోజ, రాజేందర్ పాల్గొన్నారు.
కడెం, జూన్ 21 : ఖానాపూర్‌కు మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఖానాపూర్‌లో కాకుండా ఉట్నూర్ మండలానికి తరలించే ప్రయత్నాలు సరికాదని, ఇంటిగ్రేటెడ్ పాఠశాలతోపాటు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలను నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారి అయిన ఖానాపూర్లోని కుమ్రం భీం చౌరస్తా వద్ద ఏర్పాటు చేసి, ఈ ప్రాంతవాసుల చీరకాల కోరికను నెరవేర్చాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ధర్నా నిర్వహించిన అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ ప్రభాకర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కాశవేణి శ్రీనివాస్, నాయకులు శ్రీరాం, నల్లగొండ, తోట రాజేశ్వర్, తిరుమల్, కృష్ణ, బుర్ర సాయి పాల్గొన్నారు.