నార్నూర్ : మహారాష్ట్ర( Maharashtra ) నుంచి వలస వచ్చిన బీసీలకు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో ఎస్టీ ధ్రువీకరణ ( ST certificates) పత్రాలు ఇవ్వద్దని బీజేపీ మండల అధ్యక్షుడు రాథోడ్ బిక్షపతి డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ జాడి రాజలింగంకు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలో బీసీలుగా ఉన్న కొందరు నార్నూర్ మండలంలో నివాసం ఉంటున్నారని, వారు లంబాడీలుగా చలామణి అవుతూ ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నారని ఆరోపించారు. దీంతో వారు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను, ప్రభుత్వ ఉద్యోగాలను పొందుతున్నారు అన్నారు.
నార్నూర్ మండలంలో 1950 నుంచి నివాసం ఉన్న వారికే ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు అందించాలని వేడుకున్నారు. కార్యక్రమంలో నాయకులు భారత్, సంతోష్, ప్రకాష్, శ్రీధర్, ధర్మ రక్షక్, శ్రీకాంత్ తదితరులున్నారు.