కాసిపేట, నవంబర్ 22 : మామిడిగూడెంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయంటూ శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘మంచం పట్టిన మామిడిగూడెం’ శీర్షికన కథనం ప్రచురితమయ్యింది. ఇందుకు యంత్రాంగం స్పందించింది. ఈ మేరకు శుక్రవారం మామిడిగూడెం గ్రామాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీశ్ రాజ్ సందర్శించారు. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
62 మందికి సేవలు అందించారు. 12 మందికి రక్త పరీక్షలు చేశారు. కొందరిని బెల్లంపల్లి దవాఖానకు రెఫర్ చేశారు. వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ర్యాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహించింది. అధికారులు మురుగు కాలువలను పరిశీలించారు. నీరు నిలువకుండా చూడాలని.. దోమల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెండు రోజుల పాటు వైద్య శిబిరం కొనసాగుతుందని వైద్యాధికారులు తెలిపారు.
తహసీల్దార్ భోజన్న ఇంటింటికీ జ్వర పీడితులను పరిశీలించారు. డ్రైనేజీ వ్యవస్థ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని మాజీ సర్పంచ్ సంపత్ నాయక్ కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ సుధాకర్ నాయక్, వైద్యాధికారి డాక్టర్ కిరణ్, వైద్య అధికారులు శ్రీనివాస్, నాందేవ్, బుక వెంకటేశ్వర్, వెంకట సాయి, మాజీ సర్పంచ్ సంపత్ నాయక్, కార్యదర్శి శ్వేత, చందు, తదితరులు పాల్గొన్నారు.