మంచిర్యాల అర్బన్, నవంబర్ 10 : మంచిర్యాలలోని సాయికుంట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు కాలం చెల్లిన మందులు వాడలేదని జిల్లా వైద్యాధికారి హరీశ్ రాజ్ తెలిపారు. ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో ‘కాలం చెల్లిన మందులు’ శీర్షికన కథనం ప్రచురితమవ్వగా, కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు వైద్యాధికారి హరీశ్‌రాజ్ స్పందించి వివరణ ఇచ్చారు. ఈ నెల 6న గిరిజన ఆశ్రమ పాఠశాలలో 12 మంది విద్యార్థినులు అస్వస్వతకు గురికాగా, జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించడం.. ఆపై ఆశ్రమ పాఠశాలలో మెడికల్ ఆఫీసర్ డా.అశోక్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసిన విషయం విదితమే.
ఈ వైద్య శిబిరంలో ఉపయోగించిన మందులను యూపీహెచ్సీ రాజీవ్‌నగర్ నుంచి సరఫరా చేశారని, ఆ మందులను పూర్తిగా ఎంక్వైరీ చేసి, స్టాక్ రిజిస్టర్లో నమోదు చేసిన తర్వాతే వైద్య శిబిరంలో ఉపయోగించినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. ఇందులో ఏవీ కూడా కాలం చెల్లిన మందులు లేవని పేర్కొన్నారు. ఈ యేడాది జూన్ 29న ఏహెచ్ఎస్ (జీ) ఆరోగ్య కార్యకర్త మహేశ్వరి ‘లోపిరమైడ్’ అనే మందు (బ్యాచ్ నంబర్ టీ14892 మ్యానుఫ్యాక్చర్ డేట్ 11-2022 ఉండగా, ఎక్స్పైరీ డేట్ 10-2024)ను పొరపాటున వైద్యాధికారుల అనుమతి లేకుండా తీసుకు వచ్చారని ఆయన తెలిపారు. ఈ మందులుఏ విద్యార్థికి వాడలేదని ఆయన పేర్కొన్నారు. కాలం చెల్లిన మందులను తీసుకొచ్చినందుకు ఏఎన్ఎం మహేశ్వరిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.