ఆదిలాబాద్, జూన్ 26(నమస్తే తెలంగాణ) ః రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ పథకాలను అధికారులు క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారుల సమావేశంలో మంత్రులు మాట్లాడారు. పథకాల అమలులో అధికారుల బాధ్యత కీలమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలన్నారు.
వివిధ శాఖలవారీగా నిర్వహించిన సమీక్షలో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పలు సమస్యలను మంత్రి ముందు ప్రస్తావించారు. ఎమ్మెల్యేలు సూచించిన సమస్యలను పరిష్కరించాలని మంత్రి సూచించారు. భూ భారతి ద్వారా నిర్దేశిత సమయంలో సమస్యలను పరిష్కరించాలన్నారు. గ్రామస్థాయిలో పథకాల అమలుపై సమగ్ర నివేదికలు తయారు చేయాలని సూచించారు. జిల్లా మంత్రి వివేక్ మాట్లాడుతూ ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు జిల్లా సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రైతులందరికీ రుణమాఫీ చేయాలి : బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్
రుణమాఫీ చేసినట్లు ప్రభుత్వం చెబుతుందన్నారు. ఒక్క బోథ్ నియోజకవర్గంలో 64 వేల మంది రైతులు ఉండగా.. కేవలం 32 వేల మందికి మాత్రమే వర్తించిందన్నారు. పోడు భూములు సాగు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు భూ భారతిలో కాస్తు కాలంలో చోటు కల్పించాలన్నారు. బోథ్ నియోజకవర్గంలో గిరిజనులతోపాటు గిరిజనేతరుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించినా అధికారులు ఇబ్బందులు గురి చేస్తున్నట్లు మంత్రులకు సూచించారు. బోథ్ ప్రభుత్వాసుపత్రిలో సర్జన్ బదిలీ సరికాదని వైద్యుల బదిలీ అధికారం కలెక్టర్లకు ఇవ్వాలన్నారు.
తప్పిన ప్రమాదం
జిల్లా పర్యటనలో భాగంగా ఆదిలాబాద్‌కు వచ్చిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్‌లు పార్కులో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. వారు మీడియాతో మాట్లాడుతుండగా చెట్టు కొమ్మ విరిగి కొంతదూరంలో పడింది. ఆ స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
ఎమ్మెల్యే కోవ లక్ష్మికి అగౌరవం
ఉమ్మడి జిల్లా అధికారులు, ఎమ్మెల్యేల సమావేశంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి అగౌరవం ఎదురైంది. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వివిధ శాఖల అధికారుల సమావేశంలో మహిళా ఎమ్మెల్యేకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేదికపై కూర్చోవడానికి ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు చివరి సీటు కేటాయించారు. వేదిక పైకి రావడానికి, దిగడానికి పోయే దారిలో ఈ కూర్చి ఉండడంతో ఎమ్మెల్యే ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీంతో అసహనానికి గురైన ఎమ్మెల్యే వేదిక దిగి, అధికారులకు కేటాయించిన సీట్లలో కూర్చున్నారు. ఈ సమావేశంలో ఉన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వేదిక పైనుంచి దిగి కోవ లక్ష్మి వద్దకు వచ్చి తన సీట్లో కూర్చోవాల్సిందిగా కోరారు. సహచర ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అభ్యర్థన మేరకు వేదికపైకి వెళ్లిన కోవ లక్ష్మి అనిల్‌జాదవ్‌కు కేటాయించిన సీట్లో కూర్చున్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వేదిక చివరి సీట్లో కుర్చొని సమావేశంలో పాల్గొన్నారు.