కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవులను టైగర్ కన్జర్వేషన్‌గా మారుస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవో-49పై గిరిజనం కన్నెర్ర చేస్తున్నది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమరశంఖాన్ని పూరించింది. పెసా చట్ట ప్రకారం ఎలాంటి గ్రామ సభలు నిర్వహించకుండా.. ఆమోదం లేకుండానే దొడ్డిదారిలో తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమబాట పట్టింది. ఆదివాసీ హక్కుల పోరాట సమితి(తుడుం దెబ్బ), రాయిసెంటర్ల ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ పోరుకు 15 ఆదివాసీ, మరో 35 ప్రజా సంఘాలు మద్దతు తెలపడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
గ్రామాల్లో రాజుకుంటున్న వ్యతిరేకత
టైగర్ కన్జర్వేషన్ ఏర్పాటు వల్ల 339 గ్రామాలపై ప్రభావం పడనున్నది. బఫర్ ఏరియాలోనూ అనేక గ్రామాలపై ప్రభావం చూపనున్నది. జీవో 49 వల్ల అడవులను నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసీల బతుకులు ఆగమయ్యే పరిస్థితి ఉంది. ఆదివాసీలతో పాటు ప్రత్యక్షంగా.. పరోక్షంగా అడవులపై ఆధారపడి జీవించే ఇతర గిరిజన తెగల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారనున్నది. పెసా చట్టం ప్రకారం ఆదివాసీలను సంప్రదించకుండా, గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన జీవో 49ను ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో జీవో 49కు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. ప్రతి ఆదివాసీ గ్రామంలో గ్రామ సభ నిర్వహించిన ఆదివాసీలు ఒక ప్రణాళికాబద్ధంగా నిర్మాణత్మకమైన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. సోమవారం జిల్లాలో అటవీ రేంజ్ అధికారులు, తహసీల్దార్లకు జీవో 49ను రద్దుచేయాలని తీర్మానాలు అందజేశారు.
21న జిల్లా బంద్, 28న కలెక్టరేట్ ఎదుట ధర్నా
జీవో 49కు వ్యతిరేకంగా గ్రామాల్లో తీర్మానాలు చేస్తున్న గిరిజనులు మండలాల్లో అటవీ, రెవెన్యూ శాఖల అధికారులకు వినతి పత్రాలు అందజేస్తున్నారు. టైగర్ కన్జర్వేషన్‌కు వ్యతిరేకంగా ప్రతి గ్రామంలో తీర్మానాలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి జీవో 49 రద్దుపై ఎలాంటి స్పందన రాకపోతే తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21న జిల్లా బంద్ నిర్వహించడంతో పాటు ఈ నెల 28న కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించేందుకు ఆదిసీలు సన్నద్ధమవుతున్నారు.
అన్ని ప్రజా సంఘాల మద్దతుతో…
టైగర్ కన్జర్వేషన్‌కు ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆదివాసీ హ క్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమానికి జిల్లాలోని దాదాపు 15 ఆదివాసీ సం ఘాలతోపాటు ఇతర గిరినేతర సంఘాలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నాయి. ఈనెల 21న చేపట్టనున్న జిల్లా బంద్‌కు అన్ని ప్రజా సంఘాలు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి అనుకూల స్పందన రాకపోతే ఈ నెల 28న కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టనున్నారు. జీవో 49కు వ్యతిరేకంగా ఇప్పటికే జిల్లాలో దాదాపు 2 నెలలుగా ఆదివాసీలు ఉద్యమాలు చేస్తున్న విషయం విదితమే.
జీవో 49ను రద్దు చేయాలని వినతి
సిర్పూర్(టీ), జూలై 14 : జీవో 49ను వెంటనే రద్దు చే యాలని మండల ఆదివాసీ, గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మండల కేం ద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో తాసీల్దార్ రహీమొద్దీన్, మండల అటవీ శాఖ కార్యాలయంలో అటవీ శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల రాయిసెంటర్ సార్మేడి సుర్పం అర్జు, తుడుందెబ్బ మండల అధ్యక్షుడు గంట గోపాల్, కోలవార్ జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డం రంగన్న, కోలవార్ సంఘం కార్యదర్శి నాయిని సత్తయ్య, తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు గెడం నగేశ్, మహిళలు, గిరిజన నాయకులు పాల్గొన్నారు.
పెసా చట్టానికి వ్యతిరేకం..
కౌటాల, జూలై 14 : పెసా చట్టానికి వ్యతిరేకంగా జీవో 49 ఉన్నదని, దానిని వెంటనే రద్దు చేయాలని తుమ్డిహెట్టి గ్రామస్తులు సోమవారం తహసీల్దార్ ప్రమోద్‌కు వినతి పత్రం అందజేశారు. పెసా చట్టం ప్రకారం గ్రామ సభలు పెట్టి తీర్మా నం చేయాలని, కానీ అలాంటిదేదీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం, అటవీ అధికారులు తప్పుడు తీర్మానాలు చేశారన్నారు. వెంటనే జీవో 49ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెసా గ్రామ కమిటీ సభ్యులున్నారు.
ఆందోళనలు చేపడుతాం..
కెరమెరి, జూలై 14: జీవో నంబర్ 49ను వెంటనే రద్దు చేయాలని, లేదంటే ఆందోళనలు చేపడతామని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ కుమార్ అన్నారు. సోమవా రం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తుడుం దె బ్బ, రాయి సెంటర్, ఆదివాసీ సం ఘాల నాయకుల ఆధ్వర్యంలో తహసీల్దార్ భూమేశ్వర్, కెరమెరి ఎఫ్ఆర్వో సయ్యద్ మజారొద్దీన్కు వినతిపత్రం అందించారు. 49 జీ వో రద్దు చేసే వరకూ వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మడవి భరత్ భూషణ్, జిల్లా నాయకుడు కనక ప్రభాకర్, తుడుందెబ్బ మండల అధ్యక్షుడు కుడ్మెత సోము, రాయి సెంటర్ సార్మేడీలు రాయి సిడాం జంగు, ఆత్రం బొజ్జీరావ్, పెందోర్ రాజేశ్వర్, నాయకులు చాహకటి రాంకిషన్, గేడం సోము పాల్గొన్నారు.
పోరాటాలకు సిద్ధం
తిర్యాణి,జూలై 14: జిల్లా అడవులనుంచి ఆదివాసులను తరిమివేయాలనే కుట్రతో బీజేపీ,కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్న జీవో 49పై పోరాటాలకు సిద్ధమైనట్లు ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) జిల్లా ప్రధానకార్యదర్శి వెడ్మ భగవంతరావు,డివిజన్ అధ్యక్షుడు గేడేం సుభాష్ తెలిపారు.దీనిపై ఆయా ఆదివాసీ సంఘాల నాయకులతో కలసి సోమవారం తహసీల్దార్, అటవీశాఖ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. వారు మాట్లాడుతూ జిల్లాలోని 339 గ్రామాలను టైగర్ కారిడార్‌గా మార్చే కుట్ర జరుగుతుందన్నారు. ముఖ్యంగా తిర్యాణి మండలంలోనే ఎక్కువ గ్రామాలు తుడిసిపెట్టుకుపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు 49 జీవోను రద్దు చేయాలని, లేదంటే ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ నాయకులు తోడసం భాస్కర్, పెందోర్ ధర్ము, గోపాల్, సీతారాం, తుకారాం తదితరులు పాల్గొన్నారు.