నిర్మల్ అర్బన్, ఆగస్టు 25 : పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి వారి కష్టాలను తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని బంగల్పేట్- నాగనాయిపేట్లో పేద ప్రజలకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కాగా కాలనీ మహిళలు మంగళ హారతుతో ఘన స్వాగతం పలికారు. అనంతరం 1020 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇండ్లు కట్టుకునే ఆర్థిక స్థోమత లేక కిరాయి ఇండ్లలో ఇంటూ అద్దె చెల్లించలేని వారికి ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఒక్కో ఇంటిని రూ. 5లక్షలతో నిర్మించి పూర్తి ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 43 బ్లాకుల్లో 1020 ఇండ్లను నిర్మించుకున్నామని, ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 8 లక్షల లీటర్ల సామర్థ్యంతో తాగునీటి సంపును ఏర్పాటు చేశామన్నారు. 2000 కుటుంబాల కోసం ఈ ప్రాంతంలో బస్తీ దవాఖాన, పాఠశాలను, నిర్మించనున్నట్లు చెప్పారు. రూ. 10 లక్షలతో హనుమాన్ ఆలయ నిర్మాణానికి హామీ ఇచ్చారు. పేదల సంక్షేమం కోసం అందించిన డబుల్బెడ్రూంలను ఇతరులకు విక్రయించుకోవద్దని, ఎవరైనా విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ సందర్భంగా నాగనాయిపేట్లోని డబుల్బెడ్రూం కాలనీకి కేసీఆర్ కాలనీగా నామకరణం చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లు రాని వారి కోసం ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఇందులో భాగంగా సొంత స్థలం ఇండి ఇల్లులేని వారు, గుడిసెలో నివసిస్తున్న వారికి రూ. 3 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. దీనికి లబ్ధిదారులు ఒక్కరూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే రుణాలను మంజూరు చేస్తామని వెల్లడించారు. వచ్చే నెలలో నిర్మల్ జిల్లాకు మంత్రి కేటీఆర్ రానున్నారని తెలిపారు. రూ.100 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పర్చుకోనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మంత్రిని పూలమాల శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కలెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి, అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, మున్సిపల్ కమిషనర్ రాజు, చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్లు బిట్లింగ్ నవీన్, నరేందర్, ఎస్పీ రాజు తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, ఆగస్టు 25 : రాష్ట్ర ప్రభుత్వం టేకేదార్లకు పెన్షన్ మంజూరు చేసిందుకు శుక్రవారం నిర్మల్ జిల్లాలోని టేకేదార్లు క్యాంపు కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి సన్మానించారు. టేకేదార్ల సంక్షేమానికి కృషి చేసిన సీఎం కేసీఆర్, మంత్రి ఐకేరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. దిలావర్పూర్ మండల కన్వీనర్ దేవేందర్‌రెడ్డి, నాయకులు ఉన్నారు.
నిర్మల్ పట్టణంలోని గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురై జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి అల్లోల శుక్రవారం విద్యార్థులను పరామర్శించారు. అస్వస్థతకు గల కారణాలను అడిగి తెలుసుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఇక్కడ కలెక్టర్ వరుణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమాధికారి అంబాజీనాయక్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ ఉన్నారు.