సకల జనుల హితమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలకు శ్రీకారం చుడుతూనే ఉన్నది. గతంలో ప్రకటించిన వాటితో పాటు ఇటీవల తీసుకొచ్చిన వాటిని సైతం పకడ్బందీగా అమలు చేస్తున్నది. రైతురుణమాఫీ ప్రక్రియ కొనసాగిస్తూనే.. బీసీలకు రూ.లక్ష సాయం అందిస్తున్నది. ఇక స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ నెల 16న ‘మైనార్టీబంధు’ ప్రకటించేందుకు సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే ‘గృహలక్ష్మి’కి దరఖాస్తులు స్వీకరించగా, అర్హులకు రేపో.. మాపో రూ. 3 లక్షల సాయం పంపిణీ చేయనున్నది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి.. వేలాది మంది కార్మికులకు భరోసానిచ్చింది. వీఆర్ఏలను ఉద్యోగులుగా మార్చడంతో పాటు జేపీఎస్‌లను రెగ్యులరైజ్ చేసి ఆర్డర్ కాపీలు సైతం అందిస్తున్నది. ధూప,దీప నైవేద్యం కింద ఉమ్మడి జిల్లాలో 154 మంది అర్చకులను ఎంపిక చేసి అండగా నిలిచింది. ఇక ఎక్కడికెళ్లినా సర్కారు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమంపైనే చర్చ సాగుతున్నది. ఈ నేపథ్యంలో వివిధ పథకాల్లో లబ్ధిపొందిన వారిని ‘నమస్తే’ పలకరించగా.. వారు తమ సంతోషాన్ని పంచుకున్నారు.
– మంచిర్యాల, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)

నిర్మల్ టౌన్, ఆగస్టు 11: నర్సాపూర్ (జీ) మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న మల్లికార్జునస్వామి దేవాలయంలో 11 ఏళ్లుగా పూజలు చేస్తున్న. గతంలో ఒకటి, రెండు పండుగలకు మాత్రమే ఆలయానికి జనాలు వచ్చేవారు. ఇక చాలా ఇబ్బందయ్యేది. దేవుడు ఆదుకుంటా డనే నమ్మకం ఉండేది. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కృషితో ధూపదీప నైవేద్యం కింద మా ఆలయం ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. ఇక నుంచి నాకు ప్రతినెలా రూ. 6 వేలు ప్రభుత్వం చెల్లించనుంది.
-గంగాప్రసాద్, మల్లికార్జునస్వామి దేవాలయం, నర్సాపూర్ (జీ)
మంచిర్యాల, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల పండుగ జోరుగా సాగుతున్నది. లెక్కకు మించిన పథకాలు పేదలను వరిస్తున్నాయి. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పథకాలు అమలు చేస్తున్నది. అంతకుముందున్న వందల పథకాలు నిరంతరాయంగా ప్రజలకు చేరుతుండగా, ఇటీవల ప్రకటించిన కొత్త పథకాలు సైతం అమల్లోకి రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. రైతు రుణమాఫీ ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుండగానే.. ఇటీవల ప్రకటించిన బీసీలకు రూ.లక్ష సాయం అందిస్తున్నది. ఈ మేరకు ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చెక్కులు పంపిణీ చేస్తున్నారు. దీంతో కులవృత్తులపై ఆధారపడి పనిచేస్తున్న వారి బతుకులకు భరోసా దొరకనుంది. ఇక స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా మైనార్టీబంధు పథకాన్ని 16న ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. ప్రతి నియోజకవర్గంలో 300 మంది చొప్పున బీసీలకు తొలివిడుతగా సాయం అందుతుంది. ఇప్పటికే అనేక మందికి లబ్ధిపొందారు. ఇక రేపో, మాపో గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలు సైతం లబ్ధిదారులకు అందనున్నాయి. ఆగస్టు 10న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసిందో లేదో.. నిన్నటి నుంచే అధికారులు సర్వే మొదలుపెట్టారు. అతి త్వరలో అర్హుల జాబితాను ప్రకటించనున్నారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడికి వెళ్లినా సంక్షేమ పథకాల గురించే చర్చ సాగుతున్నది. ఏ మనిషిని కదిలించినా ఏదో ఒక ప్రభుత్వ పథకం కింద లబ్ధిపొందినవారే ఉన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో రాష్ట్రంలో 43 వేల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరింది. మొన్నటికి మొన్న రేషన్ డీలర్లకు టన్నుకు రూ.1400 కమీషన్ పెంచడంతో పాటు ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న 13 డిమాండ్లను నెరవేర్చారు. ఈ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలో 1,492 మంది డీలర్లకు ప్రయోజనం చూకూరింది. అలాగే వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చి, వివిధ శాఖల్లోకి సర్దుబాటు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 1952 మందికి పోస్టింగులు ఇచ్చి ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అలాగే గడిచిన నాలుగేళ్లుగా పల్లె ప్రగతితో పాటు గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడంతో కీలక పాత్ర పోషిస్తున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీలు(జేపీఎస్‌ల)లను రెగ్యులరైజ్ చేస్తున్నారు.
నిర్మల్ జిల్లాలో మొత్తం 290 మంది జేపీఎస్‌లు ఉండగా, వీరిలో 219 మంది క్రమబద్ధీకరణకు అర్హత సాధించారు. ఇప్పటికే 138 మందికి ఆర్డర్లు సైతం ఇచ్చారు. మంచిర్యాల జిల్లాలో 218 మంది ఉండగా, 127 అర్హత పొందారు. వీరిలో ఏడుగురికి శుక్రవారం అర్డర్లు ఇచ్చారు. ఆదిలాబాద్‌లో 322 మంది ఉండగా, అర్హత సాధించిన 25 మందికి ఆర్డర్లు ఇచ్చారు. ఆసిఫాబాద్ జిల్లాలో 208 మంది జేపీఎస్‌లు ఉండగా, 26 మంది రెగ్యులర్ కానున్నారు. జిల్లా స్థాయి కమిటీలు వేసే మార్కుల్లో 70 మార్కులు సాధించిన జేపీఎస్‌లకు ఆర్డర్లు ఇస్తున్నారు. వచ్చే నెలలో మరికొంత మంది అర్హత సాధిస్తారని, అప్పుడు వారందరినీ క్రమబద్ధీకరిస్తామని ఉన్నత అధికారులు చెబుతున్నారు. జేపీఎస్‌లకు ఆర్డర్లు ఇస్తున్న క్రమంలోనే దూపదీప నేవేధ్యం పథకం కింద ఉమ్మడి జిల్లాలో మరో 154 మంది అర్చకులను ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బీసీబంధు అందుకున్న లబ్ధిదారులు, క్రమబద్ధీకరించిన జేపీఎస్‌లు, ధూప,దీప నైవేద్యం పథకం కింద ఎంపికైన అర్చకులు తమ సంతోషాన్ని ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.

గిరిజనుల అత్యంత ఇష్ట దైవం జగదాంబ దేవి. అందుకే గిరిజన బిడ్డలు యేటా జగదాంబదేవి ఆలయాన్ని సందర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని అంటారు. లింగాపూర్ గ్రామంలోని జగదాంబదేవి ఆలయాన్ని నిర్మించాలని మా గ్రామస్తులంతా కూడా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి విన్నవిస్తే మూడేళ్ల క్రితం దేవాలయం నిర్మించుకున్నాం. ప్రతిరోజు పూజలు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు భక్తులు ఇచ్చిన కానుకలపై ఆధారపడి ఉండేవాణ్ణి. ఇప్పుడు మా ఆలయాన్ని దేవదాయశాఖలోకి మార్చి ధూపదీప నైవేద్యం కింద ఎంపిక చేయడంతో నాకు ప్రభుత్వం ద్వారా ప్రతినెలా గౌరవ వేతనం దక్కనుంది.
-ప్రకాశ్ మహారాజ్, లింగాపూర్, మామడ మండలం
నిర్మల్ టౌన్, ఆగస్టు 11: మా కాలనీలో చిన్న హనుమాన్ ఆలయం ఉండేది. అందులోకి భక్తులు ఒకరిద్దరూ వస్తేనే ఎన్నో ఇబ్బం దులు పడేవాళ్లం. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక కృషితో ఇటీవల రూ. 50 లక్షలతో కొత్త ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో 20 ఏళ్లుగా పూజారిగా ఉన్న. ఇప్పుడు ఆలయం అభివృద్ధి చేయడం వల్ల భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో రోజుకు 10 నుంచి 20 మంది భక్తులు వచ్చేవాళ్లు. ఇప్పుడు వంద దాటిపోయింది.
-నరేందర్, హనుమాన్ ఆలయం చింతకుంటవాడ, నిర్మల్
నస్పూర్, ఆగస్టు 11: మా తాతలు, తండ్రుల కాలం నుంచి దర్జీ పని చేసుకుంటూ బతుకుతున్నం. చిన్న దుకాణంలో నేను కూడా పాత మిషన్లతోనే బట్టలు కుట్టుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న. దయగల సీఎం కేసీఆర్, మా ఎమ్మెల్యే దివాకర్ రావు సారు మమ్ముల్ని గుర్తించి కులవృత్తుల అభివృ ద్ధికి లక్ష రూపాయల సాయం అందించి మా కుటుంబానికి అండగా నిలిచిన్రు. ఈ డబ్బులతో అధునాతన కరెంటుతో నడి చే జాక్ మిషన్లను కొంట. నాతో పాటు ఇంకో ఇద్దరికి ఉపాధి కూడా ఇస్తా.
– మామిడిశెట్టి అఖిల్ కుమార్, టైలర్, దండేపల్లి
నస్పూర్, ఆగస్టు 11: నేను కుమ్మరి కుండలు తయారు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న. ఎండలో రోజూ ఇబ్బంది పడాల్సి వస్తున్నది. ప్రభు త్వం అందిస్తున్న లక్ష రూపాయల ఆర్థిక సాయంతో ఒక షెడ్డు వేసు కుంట. కావాల్సిన సామాన్లు కొనుక్కుంట. వ్యాపారా న్ని వృద్ధి చేసుకుంటూ ఆర్థికంగా ఎదిగేందుకు మరింత కష్టపడుతా. సీఎం కేసీఆర్, దివాకర్ రావు సార్లకు ధన్యవాదాలు.
– ఇజ్జగిరి సాయికుమార్, రాజీవ్‌నగర్
నస్పూర్, ఆగస్టు 11: ఇస్త్రీ షాపు పెట్టుకొని జీవనం సాగిస్తు న్నాం. డబ్బులు లేక దీనిని ఏ మాత్రం పెద్దది చేయలేక పోయాం. కేసీఆర్ అందజేసిన ఈ లక్ష రూపాయల సాయంతో షాపును పెద్దదిగా చేస్తా. నలుగురు వచ్చి కూర్చునేందుకు కుర్చీలు తీసుకొస్తా. మంచిది కరంటు ఇస్త్రీ పెట్టే తీసుకొస్తా. షాపు ఎంత పెద్దది చేస్తే కస్టమర్లు అంత పెరుగుతరు. చిన్నగా ఉంటే పెద్ద పెద్దోళ్లు ఇటు చూస్తలేరు. ఇవి నాకు మంచిగ ఉపయోగపడుతయ్.
నస్పూర్, ఆగస్టు 11: నేను శ్రీరాంపూర్ స్టేట్‌బ్యాంకు పక్కన ఇస్త్రీ షాపు నడిపిస్తున్న. ప్రభుత్వం ఇస్తున్న ఈ సాయంతో టేలా ఏర్పాటు చేసుకొని ఆధునిక ఇస్త్రీ సామగ్రి కొనుక్కుంట. మా లాంటి పేదోళ్లను గతంలో ఎవ్వరూ పట్టించుకోలె. కేసీఆర్ సారులా ఏ ఒక్కలూ మంచి చేసింది లేదు. సర్కారు ఇచ్చిన సాయంతో మా కుటుంబం సంతోషంగా ఉన్నది.
-పుట్టపాక తిరుపతి, చాకలి, శ్రీరాంపూర్