నస్పూర్/ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, ఏప్రిల్ 4 : వేసవి పూర్తయ్యే దాకా ప్రణాళికాబద్ధంగా తాగు నీరందించాలని ప్రత్యేక కార్యదర్శి, కార్మిక శాఖ సంచాలకుడు కృష్ణాదిత్య అన్నారు. గురువారం కలెక్టరేట్లో మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు బదావత్ సంతోష్, వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్లు రాహుల్, దీపక్ తివారీతో కలిసి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ అందుతున్న తాగునీటి సరఫరా ప్రక్రియ పరిశీలించాలని, ఇబ్బందులుంటే తగు చర్యలు చేపట్టాలన్నారు. జన్నారం మండలానికి కడెం ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న 23 టీఎంసీల నీటి నుంచి సరఫరా చేయాల్సి ఉందన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా సరఫరా అవుతున్న నీటిపై ప్రతిరోజూ నివేదిక అందించాలన్నారు.
బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని 7 మండలాలకు 1.8 టీఎంసీల నీరు అవసరముండగా, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అడ ప్రాజెక్టు నుంచి సరఫరా చేయాలన్నారు. ఈ క్రమంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం, హెచ్చుతగ్గులు లేకుండా చూడాలన్నారు. పల్లెల్లోని బోర్వెల్లు, మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ల ద్వారా రోజూ నీటి సరఫరా చేయాలని తెలిపారు. నీటిని సరఫరా చేయలేని ప్రాంతాలను గుర్తించి ప్రత్యామ్నాయ మార్గాలు, వాటర్ ట్యాంకర్ల ద్వారా అందించాలని సూచించారు. వచ్చే మూడు నెలలు ఇంటింటికీ నీరందించేలా చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో అవసరమున్న ప్రాంతాల్లో బోర్వెల్లు అద్దెకు తీసుకుని నీటి సరఫరాకు చర్యలు చేపడుతున్నామన్నారు.
మంచిర్యాల జిల్లా పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అడ ప్రాజెక్టు, నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుల ద్వారా తాగునీరు సరఫరా అవుతుందని తెలిపారు. 16 మండలాల్లోని 640 మారుమూల గ్రామాలకుగాను 637 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా నీటిని అందించడం జరుగుతుందన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీలు, 10 మండలాలకు ప్రతి రోజూ నీటిని సరఫరా చేయాలని, తిర్యాణి, లింగాపూర్ , సిర్పూర్ (యు) మండలాలలో తాగునీటిని అందించేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించాలని కృష్ణాదిత్య తెలిపారు.కలెక్టర్ వెంకటేశ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వేసవికాలంలో తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.