నమస్తే నెట్వర్క్, జూలై 20 : కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న ముసురు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నది. నదులు, ప్రాజెక్టులకు వరద వస్తుండగా, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంటలు నీట మునిగాయి. ఇండ్లు కూలిపోగా, రోడ్లు కోతకు గురయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా సరాసరి 8.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆసిఫాబాద్ మండలంలోని గుండి వాగు, తుంపెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. తుంపెల్లి వాగును కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ శ్రీనివాస్‌రావు పరిశీలించారు. అడ ప్రాజెక్టులోకి 1,778 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, అధికారులు 4,5 గేట్లు 0.30 మీటర్ల మేరకు ఎత్తి 1941 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయగా, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) దాసరి వేణు, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి పరిశీలించారు. సాయం కోసం 08733-279033, 6304686505లలో సంప్రదించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా పౌర సంబంధాల అధికారి సంపత్‌కుమార్, కలెక్టరేట్ పరిపాలనాధికారి రఫతుల్లా ఉన్నారు. చింతలమానేపల్లి మండలంలోని దిందా గ్రామం రెండు రోజులుగా జలదిగ్బంధంలో ఉంది. రాకపోకలు నిలిచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పాఠశాలలకు ఉపాధ్యాయులు రావడం లేదని, పడవ సౌకర్యం కల్పించాలని దిందా గ్రామస్తులు కలెక్టర్‌కు లేఖ రాశారు. కేతిని, దిందా, శివపెల్లి,నాయికపుగూడ, బాలాజీ అనుకోడ, ఈదుల ఒ ర్రె, రణవెల్లి వాగు, చింతలపాటి వాగు లు ఉప్పొంగి ప్రవహిస్తుండగా, ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయా యి. పెంచికల్పేట్ మండలంలోని పెద్దవాగు, ఉచ్చమల్లి, బొకి వాగు ఉధృతం గా ప్రవహిస్తున్నాయి. దహెగాం మండ లం అందవెల్లి వద్ద పెద్దవాగు వంతెనపై నిర్మించిన అప్రోచ్ రోడ్డు కోతకు గురికాగా, కాగజ్‌నగర్, భీమిని, దహెగాం మండలాల్లోని 42 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినాయి. ఐనం గ్రామ సమీపంలో రోడ్యాములపై భారీగా వరద ప్రవహించగా, రెండు గంటల పాటు రాకపోకలు నిలిచి పోయినాయి.
వందలాది ఎకరాల్లో పత్తి, వరి, తదితర పంటలు నీట మునిగాయి. కౌటాల మండలం ధనుర్హెట్టి వాగు, తాటిపల్లి వద్ద వార్దా నది, ప్రాణహిత నదులను తహసీల్దార్ పుష్పలత, ఎస్ఐ మధుకర్ పరిశీలించారు. క న్నెపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలోని పై కప్పు పెచ్చులు ఊడి పడ్డాయి. మంచిర్యాల జి ల్లాలో 12.2 మిల్లీమీటర్ల వర్షం పడింది. చెన్నూర్‌లోని పెద్ద చెరు వు, కుమ్మరికుంట మినీ ట్యాంకు బండ్ కు వరద చేరుకుంటుంది. మున్సిపాలిటీ కార్యాలయంలో హెల్ప్ డెస్క్(86602 91492, 9347302179)ను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ గంగాధర్ తెలిపారు. బెల్లంపల్లి డివిజన్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో హరికృష్ణ తెలిపారు. నెన్నెల మండలంలోని ఎర్రవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో లంబాడీతండా, ఖర్జీ, కోనంపేట గ్రామాల ప్రజ లు ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. డి ప్యూటీ తహసీల్దార్ ప్రకాశ్, ఆర్ఐ గణేశ్ వాగును పరిశీలించారు. పడ్తన్‌పల్లిలో దొండ రాజమ్మ ఇల్లు శనివారం కూలిపోయింది. కోటపల్లి మండలం నక్కలపల్లికి వెళ్లేదారిలో ఉన్న లోతొర్రెలో లెవల్ వం తెన, రాజారం గ్రామానికి వెళ్లే రోడ్డు కొ ట్టుకుపోయింది. ఎదుల్లబంధం గ్రామానికి వెళ్లే రోడ్డు తెగిపోగా, తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. కొండంపేటలో కుర్మ మల్లయ్య ఇల్లు కూలిపోయింది. నక్కలపల్లి గ్రామానికి చెందిన పోస్టల్ ఉ ద్యోగి వెముగంటి అనిల్ ద్విచక్ర వాహ నం మత్తడి వాగులో కొట్టుకుపోయింది. అనిల్ సురక్షితంగా వరద నుంచి బయటపడ్డాడు. గ్రామస్తులంతా కలసి బైక్‌ను బయటకు తీశారు. వేమనపల్లి మండలంలోని నీల్వాయి ప్రాజెక్టులోకి భారీగా వర ద చేరుతున్నది. చామనపల్లి, బమ్మెన వాగు లు ఉధృతంగా ప్రవహిస్తుండగా, రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాణహిత నది నిండుగా ప్రవహిస్తున్నది. సమీపంలోని పత్తి పంటలు నీటిలో మునిగిపోయాయి. జన్నారంలోని ఊర చెరువుకు జలకళ వచ్చింది. పొనకల్ ప్రధాన రోడ్డు పక్కన గల స్టేట్‌బ్యాంక్ ఎదుట భారీగా వర్షపు నీరు నిలిచింది. మంచిర్యాల కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్(08736-250501, 08736-250502) ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 100కి డయల్ చేయాలని రామగుండం సీపీ శ్రీనివాస్ ఓ ప్రకటనలో సూచించారు.