ఆసిఫాబాద్ అంబేద్కర్‌చౌక్, నవంబర్29 : దీక్షాదివస్ చారిత్రాత్మకమైనదని మాజీ ఎమ్మెల్సీ, దీక్షా దివస్ జిల్లా ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి పాల్గొన్నారు. చిల్డ్రన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం బస్టాండ్ సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అకడి నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ జెండాను ఆవిషరించారు.
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధన కోసం పోరాడిన కేసీఆర్‌ను ప్రజలు ఎప్పటికీ మరచిపోరన్నారు. రాష్ట్రం కోసం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న కేసీఆర్ చరిత్ర పుటల్లో నిలిచిపోతారన్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ హామీల అమలులో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని, ఈ విషయంపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు ఎల్ఈడీ స్క్రీన్‌పై పదేళ్ల కేసీఆర్ పాలనపై డాక్యుమెంటరీని ప్రదర్శించగా, ఆసక్తిగా తిలకించారు. ధూంధాం కార్యక్రమంలో భాగంగా కళాకారులు.. బీఆర్ఎస్ నాయకులు నృత్యాలు చేశారు. బతుకమ్మ, తెలంగాణ పాటలకు ఎమ్మెల్మే కోవ లక్ష్మి నృత్యం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరాగా.. జిల్లా కేంద్రం గులాబీమయమైంది. జై కేసీఆర్. జై తెలంగాణ నినాదాలతో ప్రధాన కూడుళ్లు మార్మోగాయి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సరస్వతి, కలాం, వెంకన్న, సలీం, అలీబిన్ హైమద్, రవీందర్, శ్రీనివాస్, అన్సార్, సాజిద్, అజయ్ కుమార్, నిసార్, హైమద్, సౌందర్య, కుందారపు శంకరమ్మ, దుర్పతాబాయి, సంగీత , ఉమా, మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు పాల్గొన్నారు.