ఆసిఫాబాద్, జూన్ 28 : ఈ నెల 30 న సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రానికి రానున్న నేపథ్యం లో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రేమలాగార్డెన్ సమీపంలో చేపడుతున్న పనులను ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్రావు బుధవారం పరిశీలించారు. నాలుగు రోజులుగా వర్షాల కారణంగా పనులు సక్రమంగా ముందుకు సాగలేదు. బుధవారం వరుణుడు కరుణించడంతో కలెక్టరేట్ నుంచి ఆశ్రమ పాఠశాల వరకు రోడ్డుకిరువైపులా బారీగేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఉపాధి హామీకూలీలతో మొక్కలు నాటుతున్నారు. కుమ్రం భీం చౌక్ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు సెంట్రల్‌లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. డివైడర్లకు రంగులు వేస్తున్నారు. విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో చిక్కుగా ఉన్న విద్యుత్ వైర్లను తొలగించి కొత్తవి అమర్చుతున్నారు. అలాగే రోడ్లపై గుంతలను పూడ్చుతున్నారు.
సీఎం పర్యటనకు పటిష్ట భద్రత : డీఐజీ
సీఎం కేసీఆర్ పర్యటనకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఐజీ రమేశ్‌నాయుడు అన్నారు. జిల్లాకేంద్రంలోని సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఎస్పీ సురేశ్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ఈ నెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయం, బీఆర్ఎస్ భవనాలను ప్రారంభించనున్నారని తెలిపారు. ట్రాఫిక్, పారింగ్, స్థలాలను సందర్శించి రూట్ మ్యాప్‌ను పరిశీలించినట్లు తెలిపారు. అలాగే భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో చర్చించారు. కార్యక్రమం లో పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డీఎస్పీలు శ్రీనివాస్ , కరుణాకర్, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.