జనగామ, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ)/వరంగల్ చౌరస్తా : కోల్కతాలో వైద్య విద్యార్థిని హత్యను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు ధర్నా చేశారు. బుధవారం అత్యవసర సేవలు మినహా విధులు బహిష్కరించారు. హత్యకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఎంజీఎం దవాఖాన జూనియర్ డాక్టర్లు ర్యాలీ చేపట్టి గాంధీ విగ్రహం ముందు ధర్నా చేయగా జనగామలోని ఆర్టీసీ చౌరస్తాలో డాక్టర్స్ అసోసియేషన్, జూనియర్ డాక్టర్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోల్కతాలోని ఆర్జీ కార్ హాస్పిటల్ అండ్ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేస్తే అక్కడి ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.
దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులకు రక్షణ కరువవుతున్నదని, కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంజీఎంలో వైద్య విద్యార్ధులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, విద్యార్థినులకు ప్రత్యేక విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని కోరుతూ ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ చిలుక మురళికి వినతిపత్రం అందజేశారు. ఎంజీఎంలో నిరసనలో ఐఎంఏ సభ్యులు, నర్సింగ్ విద్యార్థులతో పాటు బీజీపీ నేత, వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు పాల్గొని మద్దతు తెలిపారు.