జైపూర్, అక్టోబర్ 19: చెన్నూర్ నియోజక వర్గంలో చేపడుతున్న అభివృద్ది పనులను వేగవంతంగా పూర్తిచేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. శనివారం జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి విద్యుత్కేంద్రం అతిథి గృహంలో ఎమ్మెల్యే వివేక్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులతో పాటు పెండింగ్ పనులను పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
మిషన్‌భగీరథ పథకంలో భాగంగా ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని తెలిపారు. పైప్లైన్లను సంబంధించిన మరమ్మతులు ఉంటే యుద్ధ ప్రాతిపదికన పునఃరుద్ధరించాలని తెలిపారు. అదే విధంగా అంతర్గత రహదారులు, ప్రభుత్వ ఆదేశాలమేరకు చేపట్టిన ప్రభుత్వ భవనాల నిర్మాణపనులు వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు.
విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో వంగిన విరిగిన స్తంభాలను తొలగించి నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఆరోగ్య కేంద్రంలో సీజనల్ వ్యాధులకు సంబంధించి, విష జ్వరాలకు సంబంధించి మందులను అందుబాటులో ఉంచాలని సూచించారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణిత గడువులోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.