బజార్హత్నూర్, మే 1 : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త చేసిన అభివృద్ధి ఏమీ లేదని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శుక్రవారం బజార్ హత్నూర్ మండలంలోని గిరిజన గ్రామం రాంపూర్‌లో ఎమ్మెల్యే పర్యటించారు. ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలోని కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు వినాయక్ రావు, గోవింద్ రావు, రాంజీ, దేవురావు, రాజారాం, గోద్రు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కాంగ్రెస్, బీజేపీకి ‘బైబై’ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా గ్రామ పటేల్ మాట్లాడుతూ కేసీఆర్ అందించిన మిషన్ భగీరథ పథకం తమ గ్రామానికి వరంలా మారిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పల్లెలు కళకళలాడేవని, కానీ ఇప్పుడు అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. రైతుబంధు సకాలంలో అందిందని, ప్రస్తుతం వాయిదాలుగా చొప్పున ఇస్తున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సార్లు రైతుభరోసా డబ్బులు నిలిపివేశారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు.
మండలంలోని కొత్తపల్లి గ్రామంలో కాలి నడకన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించి, గ్రామస్తులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే వాగుపై వంతెన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నిలిచిపోయిన కొత్తపల్లి రోడ్డు నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. డెడ్రా, మాంకాపూర్ గ్రామాలకు త్వరలో రోడ్డు పనులు చేపడతామని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మండల కన్వీనర్ కానిందే రాజారాం, మండల యువజన సంఘం అధ్యక్షుడు డబ్బుల చంద్రశేఖర్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు పరచ సాయన్న, గిర్నూర్ సర్పంచ్ పూసల మౌనిక భీమేశ్, ఉప సర్పంచ్ గొల్లెన రాజేందర్, మాజీ ఉప సర్పంచ్ వినోద్, చట్ల వినీల్ కుమార్, బత్తిని మురళీకృష్ణ, డీసీ రమణ, తాండ్ర రాజు, కొత్త నర్సయ్య పాల్గొన్నారు.